* చీమకుర్తిలో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ప్రైవేటు సంస్థలకే
* ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రతిపాదనను తిరస్కరించిన సర్కార్
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఒంగోలు-నంద్యాల రహదారిలో ఉన్న గ్రానైట్ నిక్షేపాలను తమకు రిజర్వు చేయాలంటూ ఏపీఎండీసీ చాలా ఏళ్ల కిందటే దరఖాస్తు చేసింది. ఈ అత్యంత విలువైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలను ప్రైవేటు సంస్థలకే కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వివరాల్లోకెళ్తే..
ఒంగోలు-నంద్యాల రహదారిలో చీమకుర్తి వద్ద (24-28 కిలోమీటర్ల మధ్య) భారీ పరిమాణంలో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని తేలింది. దీంతో ఈ నిక్షేపాలను తమకు కేటాయించాలని గత ప్రభుత్వ హయాంలోనే ఏపీఎండీసీ దరఖాస్తు చేసింది. అయితే గనుల తవ్వకాలు చేపడితే వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన అప్పటి ప్రభుత్వం తవ్వకాల విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది.
ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించి, మైనింగ్‌పై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. కాగా ఆరునెలల క్రితం బైపాస్ రహదారి నిర్మాణం ప్రార ంభమైంది. దీంతో గ్రానైట్ మైనింగ్ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. దీంతో ఏపీఎండీసీకే ఈ గ్రానైట్ నిక్షేపాలను రిజర్వు చేయాలని భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదననను తిరస్కరించి టెండర్ల ద్వారానే గ్రానైట్ లీజు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా ఉండే టెండర్ల విధానాన్ని అనుసరించాలనే ఫైలుపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం మేజర్ మినరల్స్‌కు అమల్లోకి తెచ్చిన కొత్త విధానం ప్రకారం టెండర్లకు వెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
తేలని విస్తీర్ణం
ఒంగోలు - నంద్యాల రోడ్డులో 24-28 కిలోమీటర్ల మధ్య ఎన్ని మీటర్ల వెడల్పు, లోతు వరకూ ఖనిజాన్ని తవ్వాలనే అంశంపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టత లేదు. వాస్తవంగా 60 మీటర్ల వెడల్పు రోడ్డు (భూమి) మాత్రమే ప్రభుత్వానికి చెందినది. అందువల్ల ఈ 60 మీటర్ల వెడల్పు వరకూ గ్రానైట్ తవ్వకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ప్రభుత్వం మాత్రం 130 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల లోతు వరకూ గ్రానైట్ తవ్వాలని ఒక ప్రతిపాదన రూపొందించింది.
దీనిద్వారా రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి 216 కోట్లు వస్తుందని అంచనా. 130 మీటర్ల వెడల్పు 80 మీటర్ల లోతు వరకూ తవ్వకాలు జరపాలనేది మరో ప్రతిపాదన. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 339 కోట్ల రాయల్టీ వస్తుందనేది మరో ప్రతిపాదన. ప్రస్తుత సీనరేజి ప్రకారమే ఈ రాబడి వస్తుందని, పూర్తిస్థాయిలో ఖనిజ నిక్షేపాల అంచనా అనంతరం టెండర్లలో సంస్థలు పోటీ పడేదానిపై రాబడి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పట్టాభూములు ఎలా..
130 మీటర్ల వెడల్పు వరకూ గ్రానైట్ తవ్వకాలు జరపాలంటే పట్టా భూములను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకు సమయం పడుతుందని, కొత్త భూసేకరణ పాలసీ ప్రకారం భూముల సేకరణ వ్యయం భారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఎంత విస్తీర్ణంలో తవ్వకాలకు టెండర్లు పిలవాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ రోడ్డు కింద తవ్వకాలు చేపడితే బైపాస్ రోడ్డులో వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది.
ఏపీఎండీసీకి మొండిచేయి
Published Mon, Nov 30 2015 3:39 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement
Advertisement