’నలంద’లో పాక్ విద్యార్థులకు అడ్మిషన్!
రాజ్ గిరి: దేశంలోనే ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం ఇద్దరు పాకిస్తానీ విద్యార్ధులకు అడ్మిషన్ ఇచ్చింది. భారత్-పాకిస్తాన్ ల మధ్య రాజకీయంగా యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పాక్ విద్యార్థులకు నలంద వర్సిటీ వారికి సీట్లు కేటాయించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫర్ చేసిన 83 సీట్లలో రెండు పాకిస్తాన్ విద్యార్ధులకు కేటాయించినట్లు అడ్మిషన్స్ అధికారి తెలిపారు.
మొత్తం పదమూడు దేశాల నుంచి 80 మంది విద్యార్థులు ఇప్పటికే యూనివర్సిటీలో రిపోర్ట్ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన మూడు సీట్లను మయన్మార్ నుంచి ఒకరికి, పాకిస్తాన్ నుంచి ఇద్దరికి కేటాయించామని చెప్పారు. అయితే, వారు ఇంకా యూనివర్సిటీలో రిపోర్ట్ చేయలేదన్నారు. భూటాన్, వియత్నాం, లావోస్, పెరూ, చైనా, దక్షిణ కొరియా, దక్షిణ ఆఫ్రికా, నైజీరియా, మయన్మార్, జపాన్ తదితర దేశాల నుంచి విద్యార్ధులు అడ్మిషన్ తీసుకున్నారని వివరించారు.
వీసా జారీలో జాప్యం కారణంగానే యూనివర్సిటీలో రిపోర్టు చేయడం ఆలస్యం అవుతోందని పాక్ కు చెందిన విద్యార్ధులు చెప్పారని పేర్కొన్నారు. ఇరువురు విద్యార్థులు స్కూల్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ అండ్ ఎకాలజీలో చేరతారని నలంద డైరెక్టర్ స్మితా తెలిపారు. యూనివర్సిటీలో అడ్మిషన్ కొరకు ప్రపంచంలోని 50 దేశాల నుంచి మొత్తం ఆరు వేల అప్లికేషన్లు వచ్చానట్లు వివరించారు.