ఈ బంధం అనిర్వచనీయమైంది
మాస్కో: రష్యాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం రాత్రి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. రష్యా ఎక్స్‌పో సెంటర్లో 3000మంది ప్రవాసభారతీయులు పాల్గొన్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యన్లు భారత్‌పై చూపిస్తున్న మమకారానికి సగటు భారతీయ హృదయం ఉప్పొంగుతుందన్నారు. భారత్ రష్యాల బంధం అనిర్వచనీయమైందన్నారు. ముందుగా నమస్తే అంటూ ప్రవాస భారతీయులను సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
రష్యా ప్రముఖ పాప్ సింగర్ సాటి కఝనోవా వేద మంత్రాలను ఉచ్ఛరించటం విశేషం. చూస్తూ చదవకుండా.. మంత్రాలను స్పష్టంగా ఉచ్ఛరింటం ఆనందం కలిగించిందని.. అది ఆమె చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, మాజీ ప్రధాని వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన రాసిన ‘మై గీత్ నయా గాతా హూ’ పాటపై రష్యా కళాకారులు ప్రదర్శన, గుజారాతీ నృత్యం గార్బాపై డాన్సులపై సంతోషం వ్యక్తం చేశారు. రష్యన్ల నుంచి గార్బా నేర్చుకుంటామన్నారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* భారత్-రష్యా మధ్య బంధం చాలా పాతది. కానీ రష్యన్లు భారత సంస్కృతిని నేర్చుకోవటం గొప్పవిషయం.
* రష్యాకు చెందిన ఓ మహిళ తను యోగాపై రాసిన పుస్తకాన్ని నాకు కానుకగా ఇచ్చారు. రష్యాలో 400 ఏళ్లనాటి భారతదేశ పద్ధతిలో కట్టిన ఇంటిని చూశాను ఆనందం వేసింది.
* రష్యాపై సంస్కృత భాష ప్రభావం చాలా ఉంది. అష్ట్రాఖాన్ ప్రాంత గవర్నర్‌తో మాట్లాడాను. ఆయనకు వాటర్ మిలన్ కంటే.. తర్బూజ్ అంటేనే అర్థమైంది. మొదట్నుంచీ భారత్‌కు వెన్నంటి నిలిచిన దేశం రష్యా.
* రష్యన్లు ఎక్కువగా పర్యాటకాన్ని ఇష్టపడతారు. అందుకే ఏడాదికి కనీసం ఐదు రష్యన్ల కుటుంబాలైనా భారత్‌లో పర్యటించాలని కోరుతున్నాను.
* 21వ శతాబ్దం ఆసియా ఖండానిదే. అందులోనూ భారతదేశమే పరిస్థితులను ముందుండి నడిపిస్తుంది.
* దేశంలో 35 ఏళ్ల లోపున్న వారు 80కోట్ల మంది ఉన్నారు. వారే ప్రస్తుతం భారతదేశపు శక్తి. మేం నవభారత నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. రైల్వేల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు దారులు తెరిచాం.
* ఉగ్రవాదంతో ప్రపంచ మానవాళికి ముప్పుందని 30 ఏళ్లుగా చెబుతున్నాం. అప్పుడు ఎవరూ వినలేదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఉగ్రవాద ప్రభావాన్ని అనుభవిస్తోంది. భారత్‌లో కొందరు ఎప్పుడూ సమస్యల గురించే ఆలోచిస్తున్నారు. మేం వాటికి పరిష్కారం సూచించాం.