అది దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు | narendra Modi lauds Sardar Patel, targets Congress over '84 riots | Sakshi
Sakshi News home page

అది దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు

Published Sat, Nov 1 2014 12:21 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

అది దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు - Sakshi

అది దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు

సిక్కుల ఊచకోతపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య
ఘనంగా సర్దార్ పటేల్ 139వ జయంతి వేడుకలు
పటేల్‌చౌక్ వద్ద మోదీ నివాళి, ‘జాతీయ ఐక్యతా దినం’గా ప్రకటన
ఐక్యతా పరుగులోనూ పాల్గొన్న ప్రధాని
 
న్యూఢిల్లీ: శతాబ్దాలుగా అల్లుకుపోయిన భారత సమైక్యతా భావనకు సరిగ్గా 30 ఏళ్ల క్రితం జరిగిన సిక్కుల ఊచకోత ఘటన గొడ్డలిపెట్టువంటిదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 139వ జయంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని పటేల్‌చౌక్ వద్ద నిర్వహించిన ‘సమైక్యతా పరుగు’ కార్యక్రమంలో ప్రధాని స్వయంగా పాల్గొన్నారు. ఉక్కుమనిషి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తొలి హోంమంత్రిగా దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సర్దార్ పటేల్‌ను విస్మరించలేమని, ఆయన లేకుండా దేశ చరిత్ర లేదని మోదీ అన్నారు.
 
స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత దేశాన్ని ముక్కలు చేయాలని బ్రిటిషర్లు ప్రయత్నిస్తే పటేల్ ఒక్కరే ధైర్యంగా ఆ పరిస్థితిని చక్కదిద్దారని, దాదాపు 550 చిన్న చిన్న సంస్థానాలను దేశంలో విలీనం చేశారని కొనియాడారు. అందుకే ఆయన జయంతిని ‘జాతీయ ఐక్యతా దినం(నేషనల్ యునిటీ డే)’గా పాటించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇదే రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకొంటారని, అయితే ఆమె హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయాన్ని మాత్రం మరుగున పడేశారని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు సర్దార్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని, అయితే దురదృష్టవశాత్తూ మూడు దశాబ్దాల క్రితం ఆయన జయంతి నాడే సాటి భారతీయులు కొందరు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. అది ఏ ఒక్క వర్గానికో తగిలిన గాయం కాదని, శతాబ్దాలుగా పెనవేసుకున్న జాతీయ సమగ్రతా గుండెల్లో దిగిన గునపంలాంటిదని మోదీ వ్యాఖ్యానించారు. రాజకీయపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా జాతీయ సమగ్రత కోసమే పటేల్ పాటుపడ్డారని గుర్తు చేశారు. చరిత్రను మరచిన ఏ దేశం కూడా మరో చరిత్రను సృష్టించలేదన్న విషయాన్ని మనం మరవద్దన్నారు.
 

స్వాతంత్య్రోద్యమం సందర్భంగా పటేల్‌పైనే మహాత్మాగాంధీ భరోసా పెట్టుకున్నారని, ఆయన ప్రణాళికల వల్లే దండి యాత్ర విజయవంతమైందని మోదీ పేర్కొన్నారు. వివేకానందుడు లేకుండా రామకృష్ణ పరమహంస ఎలా అసంపూర్ణుడో, అలాగే సర్దార్ పటేల్ లేకుండా మహాత్ముడు కూడా అసంపూర్ణుడే అని అభిప్రాయపడ్డారు. పూర్వం చాణక్యుడిలాగే పటేల్ కూడా తన శక్తియుక్తులు ప్రదర్శించి దేశ విభజన సమయంలో భారత్‌ను ఐక్యంగా ఉంచారని కొనియాడారు. అంతకుముందు ప్రధానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వాగతం పలికారు.  సమైక్యతా పరుగులో ప్రముఖ క్రీడాకారులు సుశీల్‌కుమార్, విజేందర్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యతా పరుగులో పాల్గొన్న వారందరితో ప్రధాని ‘ఐక్యతా ప్రమాణం’ చేయించారు.
 
 ‘సర్దార్ స్మృతిశాల’గా పటేల్ స్కూలు
 
 నడియూడ్(గుజరాత్): స్వతంత్ర భారతదేశం తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ చదువుకున్న ప్రాథమిక పాఠశాల ఇపుడు స్మారక చిహ్నంగా వూరింది. గుజరాత్ రాష్ట్రం, కరంసద్ జిల్లాలోని పటేల్ పూర్వీకుల గ్రావుమైన కరంసద్‌లోని ఈ పాఠశాలలో పటేల్ ఒకటవ తరగతినుంచి ఆరవ తరగతి వరకూ (1882నుంచి1888వరకూ)చదువుకున్నారు. సంరక్షణ కరువై శిథిలావస్థకుచేరి, చెత్తదిబ్బలా తయూరైన ఈ పాఠసాల భవనాన్ని కోటీ 20లక్షల రూపాయుల వ్యయుంతో ‘సర్దార్ స్మ­ృతి శాల’గా తీర్చిదిద్దారు. పటేల్ జయుంతిని పురస్కరించుకుని ఈ స్మారక చిహ్నాన్ని గుజరాత్ వుుఖ్యవుంత్రి ఆనందీబెన్ పటేల్ శుక్రవారం ప్రారంభించారు.
 
 పటేల్ వస్తువులు ప్రధానికి అప్పగింత
 
 న్యూఢిల్లీ: దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉపయోగించిన పలు వస్తువులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వీకరించారు. పటేల్ వాడిన ప్లేట్లు, కప్‌లు, సాసర్‌లతోపాటు మరికొన్ని వస్తువులను మంజరి ట్రస్ట్‌కు చెందిన షీలా ఘటాటే ప్రధానికి ఆయన నివాసంలో అందించినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పటేల్ మనవడు బిపిన్ దహ్యాభాయ్ పటేల్, ఆయన భార్య లూయ్ వీలునామాలో పేర్కొన్న ప్రకారం ఆ వస్తువులను ఘటాటే గతంలో అందుకున్నారు. ఈ వస్తువులను అందుకున్న అనంతరం మోదీ ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ దేశ వారసత్వ సంపదలో ఈ వస్తువులు ప్రత్యేక భాగమన్నారు. అంతకుముందు పటేల్ 139వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి, పార్లమెంటులోని ఆయన చిత్రపటానికి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement