కాంగ్రెస్ కోసమే ‘మూడు’: నరేంద్ర మోడీ
నరేంద్ర మోడీ ధ్వజం
మూడో కూటమితో దేశానికి మేలు జరగదు
నేను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం
ముజఫర్‌పూర్(బీహార్): కాంగ్రెస్ ప్రయోజనాలను కాపాడ్డమే మూడో కూటమి లక్ష్యమని, దాని వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. బీజేపీ దృష్టిలో లౌకికవాదమంటే అన్ని కులాలు, వర్గాల ప్రయోజనాలను పెంపొందించి, దేశాన్ని ప్రగతి బాట పట్టించడమని, కాంగ్రెస్, ఇతర పార్టీలకు మాత్రం తాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమని ధ్వజమెత్తారు. మూడో కూటమిని బలంగా ముందుకు తెస్తున్న జేడీయూ నేత నితీశ్‌కుమార్ బీహార్ అభివృద్ధిపై చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులకు బీహార్ అడ్డాగా మారిందని విమర్శించారు. మోడీ సోమవారమిక్కడ బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇటీవలే బీజేపీతో జట్టుకట్టిన ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్, ఆయన కుమారుడు చిరాగ్, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా హాజరైన ఈ సభలో మోడీ ఏమన్నారంటే..
ఆరు నెలలు, ఏడాది కిందట మూడో కూటమి ఊసు విన్నా రా? అది ఎన్నికల సమయంలోనే వచ్చింది. అది ఎన్నికలను చెడగొట్టొచ్చు కానీ దేశానికి ఎలాంటి మేలూ చేయదు. ఇదివరకు ప్రతిదాన్నీ ఉగ్రవాదానికి, ఐఎస్‌ఐకి ఆపాదించేవారు. ఇప్పుడు ప్రతిదానికి .. ధరల పెరుగుదలకు, అవినీతి నిరోధానికి లౌకికవాదమే సంజీవనిగా మారిపోయింది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయంటే వారు లౌకికవాదం ప్రమాదంలో ఉందంటారు.
దేశ రాజకీయాలు రెండు వర్గాలుగా విడిపోయాయి. పేదరిక నిర్మూలన, ధరల నియంత్రణ, బలహీలన వర్గాల అభివృద్ధిని కాంక్షించే బీజేపీగా, నన్ను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా ఉన్న పార్టీల ముఠాగా. నన్ను వ్యతిరేకించే వారి ఎజెండా దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం కాదు, నన్ను అడ్డుకోవడ మే. లౌకికవాదం పేరిట దేశాన్ని మోసం చేసే ప్రయత్నాలతో జనానికి మేలు జరగదు (కాంగ్రెస్, నితీశ్‌లను ఉద్దేశించి).
ఏన్డీఏ కూటమి బలం పుంజుకుంటోంది. ఎల్జేపీ చేరిక తర్వాత మరిన్ని పార్టీలు చేరనున్నాయి. ఎన్డీఏ కేవలం జాతీయ ప్రజాస్వామ్య కూటమి మాత్రమే కాదు, జాతీయ అభివృద్ధి కూటమి కూడా. వచ్చే దశాబ్ది ఎస్సీలు, ఎస్టీలు, బడుగులదే.
సభలో ఎల్జేపీ చీఫ్ పాశ్వాన్ మాట్లాడుతూ, దేశంలో మోడీ గాలి వీస్తోందని, ఆయనే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.