ఒడిశా సీఎంగా నవీన్ ప్రమాణం
వరుసగా నాలుగోసారి సీఎంగా రికార్డు
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీకి ఘన విజయం సాధించి పెట్టిన నవీన్ పట్నాయక్ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఎస్.సి.జమీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు 21 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పాత కేబినెట్‌కు చెందిన ఐదుగురికి ఈసారి మంత్రివర్గంలో చోటుదక్కలేదు. ఎనిమిది మంది కొత్తవారికి అవకాశం దక్కింది. ఒడిశాను అభివృద్ధి చేయడం కోసం, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం తామంతా కలసికట్టుగా కృషి చేస్తామని 67 ఏళ్ల నవీన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉద్ఘాటించారు. 21 మంది మంత్రుల్లో 11 మందికి క్యాబినెట్ హోదా ఇచ్చారు. మొత్తం కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చారు.
నవీన్, చామ్లింగ్‌లకు మోడీ అభినందనలు
ఒడిశా, సిక్కిం ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ పట్నాయక్, పవన్ చామ్లింగ్‌లకు కాబోయే నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అభివృద్ధికి తన సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
వరుసగా నాలుగోసారి సీఎం
నాలుగోసారి సీఎం పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా నవీన్ చరిత్ర సృష్టించారు. నవీన్ కంటే ముందు ఆయన తండ్రి బిజూ పట్నాయక్, అంతకుముందు హరేకృష్ణ మహతాబ్, జేబీ పట్నాయక్‌లు వరుసగా మూడుసార్లు సీఎంలుగా రికార్డు సృష్టించారు.
ఐదోసారి సిక్కిం సీఎంగా చామ్లింగ్
సిక్కిం అధికార పీఠాన్ని పవన్ చామ్లింగ్ (63) వరుసగా ఐదోసారి అధిష్టించారు. సీఎంగా ఆయన బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని గాంగ్‌టక్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ... చామ్లింగ్‌తోపాటు 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు.