న్యూఢిల్లీ: యూపీఏ సర్కారు అవశేషాలను కడిగేసే కార్యక్రమంలో భాగంగా.. ప్రత్యేక గుర్తింపు సంఖ్య ‘ఆధార్’పై ఏర్పాటైన కేబినెట్ కమిటీ సహా నాలుగు కేబినెట్ కమిటీలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రద్దు చేసినవాటిలో ధరలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీలున్నాయి. ఆధార్‌కు సంబంధించిన యూఐడీఏఐపై ముఖ్యమైన నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నారని, మిగతా అంశాలను ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ (సీసీఈఏ) కమిటీ చూసుకుంటుందని అధికార ప్రకటనలో వెల్లడించారు.
ఇకపై డబ్ల్యూటీవో వ్యవహారాలను, ధరలకు సంబంధించిన అంశాలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సీసీఈఏను, నియామకాలపై, పార్లమెంటరీ వ్యవహారాలపై, భద్రతపై, రాజకీయ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీలను కూడా ప్రధానమంత్రి మోడీ పునర్వ్యవస్థీకరించనున్నారని వెల్లడించారు.