న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (2013-14, ఏప్రిల్-సెప్టెంబర్ 17 వరకూ) 12.5 శాతం పెరిగాయి. రూ.2,38,325 కోట్లుగా నమోదయ్యాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ధి దీనికి ప్రధాన కారణం. వేర్వేరుగా చూస్తే- కార్పొరేట్ పన్ను వసూళ్లు 7.97% వృద్ధితో రూ.1,46,610 కోట్లుగా నమోదయ్యాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 21.08 శాతం ఎగసి రూ.89,006 కోట్లుగా నమోదయ్యాయి. ఇక సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) వసూళ్లు రూ.2,210 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్ను వసూళ్లు రూ. 309 కోట్లు. సెప్టెంబర్ క్వార్టర్‌లో నికర ముందస్తు పన్ను వసూళ్లు 9.14% వృద్ధితో రూ.1,14,320 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు (7.97 శాతం వృద్ధి) రూ.1,03,374 కోట్లుకాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (24% వృద్ధి) రూ. 10,946 కోట్లు.