
అమెరికాలో ముస్లిం మతగురువుల కాల్చివేత
పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు ముస్లిం మత గురువుల కాల్చివేత ఘటన అమెరికాలో కలకలం రేపింది. కాల్పులు జరిగిన సమయంలో మృతులు ఇద్దరూ ఇస్లాం సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారని..
న్యూయార్క్: పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు ముస్లిం మత గురువుల కాల్చివేత ఘటన అమెరికాలో కలకలం రేపింది. న్యూయార్క్ నగరం తూర్పు ప్రాంతమైన క్వీన్స్ లో శనివారం మధ్యాహ్నం(లోకల్ టైమ్) ఈ దురాగతం చోటుచేసుకుంది. అక్కడి ఓజోన్ పార్క్ సమీపంలో గల అల్ ఫుర్ఖాన్ జమే మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగించికుని ఇంటికి వెళుతోన్న ఇమాం మౌలామా అకోంజీ(55), అతని సహాయకుడు తరాఉద్దీన్(64)లను గుర్తుతెలియని దుండగుడు కాల్చి చంపాడు. బుల్లెట్లు నేరుగా తలలోకి దూసుకెళ్లడంతో అకోంజి హత్యాప్రదేశంలోనే చనిపోగా, తారాఉద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
కాల్పులు జరిగిన సమయంలో మృతులు ఇద్దరూ ఇస్లాం సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారని, ఇది మతవిద్వేష హత్య అవునో కాదో ఇప్పుడే చెప్పలేమని న్యూయార్క్ పోలీసులు అంటున్నారు. పరారీలో ఉన్న దుండగుడికోసం వేటాడుతున్నామని చెప్పారు. అల్ ఫుర్ఖాన్ మసీదు ఇమాం మౌలామా అంకోజీ స్వదేశం బంగ్లాదేశ్ అని, రెండేళ్ల కిందటే ఆయన న్యూయార్క్ వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు.
మత గురువు, అతని సహాయకుడి హత్యతో క్వీన్స్ ప్రాంతంలోని ముస్లింలు ఉలిక్కిపడ్డారు. పదుల సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. న్యాయం కావాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అమెరికన్లలో ఇస్లామోఫోబియా(ముస్లింల పట్ల భయం) పెరిగిపోయేలా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్నారని, ఆయన విద్వేష వ్యాఖ్యల వల్లే ఇలాంటి హత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళకారులు ఆరోపించారు.