మనకు ఇంగ్లిష్ రాదంటూ.. వీసాలకు కోత
న్యూజిలాండ్ భారతీయ విద్యార్థులకు వీసా నిబంధనలు కఠినతరం చేసింది. అంతేకాకుండా గడిచిన ఐదు నెలల్లో భారతీయ విద్యార్థులకు ఇస్తున్న వీసాల్లో గణనీయమైన కోత విధించింది. గత ఏడాది జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో భారతీయ విద్యార్థులకు 6,462 వీసాలు ఇవ్వగా, ఈ ఏడాది కేవలం 3,102 వీసాలు మాత్రమే ఇచ్చింది. మన విద్యార్థులకు ఇచ్చే స్టడీ వీసాలలో ఏకంగా సగానికిపైగా కోత పెట్టడం గమనార్హం.
వీసా నిబంధనలు కఠినతరం చేయడం, కచ్చితమైన పర్యవేక్షణ ఉంచడంతో స్టడీ వీసాలు తగ్గాయని, భారత్ నుంచి చాలామంది విద్యార్థులు తగినంత డబ్బు, తగినంత ఇంగ్లిష్ పరజ్ఞానం లేకుండానే ఇక్కడి వస్తుండటంతో వారిని నిలువరించినట్టు న్యూజిలాండ్ ప్రభుత్వ రేడియో తెలిపింది. భారతీయ విద్యార్థులకు వీసాలు ఇవ్వడంలో న్యూజిలాండ్ ప్రభుత్వం విపరీత పోకడలు పోతున్నదని అక్కడి అక్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ పేర్కొంది. 16 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్ల సమాహారమైన ఈ సంస్థ అధికార ప్రతినిధి పాల్ చాల్మర్స్ మాట్లాడుతూ సమర్థలైన విద్యార్థుల వీసా దరఖాస్తులను కూడా ముంబైలోని న్యూజిలాండ్ రాయబార కార్యాలయం తిరస్కరిస్తున్నదని, ఇది తమ దేశంలోని విద్యాసంస్థలను దెబ్బతీయవచ్చునని వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్ భాష విషయంలో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేయడం సరైనదే కానీ, కొందరు విద్యార్థుల వీసా దరఖాస్తులను ఎందుకు తిరస్కరిస్తున్నదన్న విషయంలో స్పష్టత లేదని పేర్కొంది.