బీజేపీ కిక్కు: దూసుకొచ్చిన మార్కెట్లు
బీజేపీ కిక్కు: దూసుకొచ్చిన మార్కెట్లు
Published Tue, Mar 14 2017 9:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
ముంబై : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ ఘనవిజయం మార్కెట్లకు భారీ కిక్కిచ్చింది. రికార్డు స్థాయిల్లో స్టాక్ మార్కెట్లు దూసుకొచ్చాయి. 560 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 424.95 పాయింట్ల లాభంలో 29,371 వద్ద కొనసాగుతోంది. 160 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైన నిఫ్టీ సైతం 9,050 మార్కును దాటి ట్రేడవుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల్లో ఘన విజయంతో పాటు, గోవా, మణిపూర్ లో కూడా బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న నేపథ్యంలో మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. మంగళవారం ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా భారీగా బలపడింది.
40 పైసల లాభంతో 66.20 వద్ద ప్రారంభమైంది. గ్రీన్ బ్యాక్ కరెన్సీతో కొన్నాళ్లు పడిపోయిన రూపాయి విలువ ప్రస్తుతం ఏడాది గరిష్టంలో ట్రేడవుతోంది. అత్యంత కీలక రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు రూపాయికి బూస్ట్ ఇచ్చినట్టు మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఈ విజయం రాజకీయంగా ఉన్న అస్థిరత్వాన్ని కూడా మార్కెట్ల నుంచి తొలగించినట్టు విశ్లేషకులు చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరంగా ఉండే ప్రభుత్వాలతో మార్కెట్లు ఎక్కువగా లాభపడతాయని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలంటున్నాయి. ఆర్థిక సంస్కరణకు కూడా ఇవి ఊతమిస్తాయని చెబుతున్నారు. ఈ ఎన్నికల వేళ నిఫ్టీ 9100-9500 మార్కు రేంజ్ లో ట్రేడవుతుందని హెచ్ఆర్బీవీ క్లయింట్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీఎస్ హరిహర్ తెలిపారు.
Advertisement
Advertisement