నోట్ల రద్దు భేష్.. బినామీల పనిపట్టండి: సీఎం
నోట్ల రద్దు భేష్.. బినామీల పనిపట్టండి: సీఎం
Published Wed, Nov 16 2016 7:42 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయానికి తాను పూర్తి మద్దతు పలుకుతున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టడంతో పాటు.. బిహార్‌లో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసి విజయం సాధించిన నితీష్.. ఇప్పుడు మోదీ విధానాలకు మద్దతు పలకడం ఆశ్చర్యకరమే. అయినా.. అంశాల వారీగానే తన అభిప్రాయాలు ఉంటాయి తప్ప బద్ధ శత్రుత్వం ఉండబోదన్న విషయాన్ని నితీష్ కుమార్ నిరూపించుకున్నారు.
పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నకిలీ నోట్లన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయని ఆయన అన్నారు. బిహార్‌లోని మధుబని ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దుతో పాటు.. ఎవరెవరి వద్ద బినామీ ఆస్తులు ఉన్నాయో కూడా దృష్టిపెట్టాలని నితీష్ సూచించారు. బినామీ ఆస్తుల మీద కూడా కేంద్రప్రభుత్వం వీలైనంత త్వరగా దాడులు చేయాలని ఆయన కోరారు.
Advertisement