మోదీ తదుపరి టార్గెట్ ఏంటో తెలుసా?
మోదీ తదుపరి టార్గెట్ ఏంటో తెలుసా?
Published Tue, Nov 15 2016 3:04 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
రాత్రికి రాత్రే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. త్వరలోనే మరో సంచలనం రేపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న బినామీ లావాదేవీలపై కొరడా ఝళిపించడానికి మోదీ సై అంటున్నారు. లెక్కల్లోకి రాకుండా పోతున్న డబ్బు మొత్తాన్ని పన్ను పరిధిలోకి తేవాలని చేస్తున్న విప్లవాత్మక చర్యలలో భాగంగా బినామీ లావాదేవీలపై కన్ను పెట్టబోతున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచే బినామీ లావాదేవీలపై కఠిన చర్యలు మొదలవుతాయని సమాచారం.
ఒకపక్క ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం ద్వారా 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి అన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలన్నది మోదీ వ్యూహంలా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో గ్రామీణాభివృద్ధి పథకాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలను చేపట్టాలని, అది కూడా శరవేగంగా చేపట్టాలని మోదీ సర్కారు భావిస్తోంది.
బినామీ ఆస్తుల విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గే సమస్య లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనివల్ల తాత్కాలికంగా రాజకీయ వ్యతిరేకత వచ్చినా, దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయన్నది సర్కారు భావనగా తెలుస్తోంది. ఈ విషయమై సోమవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కూడా విస్తృతంగా చర్చ జరిగిందంటున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జాతీయవ్యాప్తంగా మద్దతు కనిపిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ సమావేశం తర్వాత తెలిపారు. నల్లధనంపై సిట్ వేయడం, రెండుసార్లు పన్నులు విధించే పద్ధతిని రద్దుచేయడం, బినామీ లావాదేవీల రద్దు బిల్లు ప్రవేశపెట్టడం లాంటి చర్యలుంటాయని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.
Advertisement
Advertisement