ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి రాసిన రెండో డైరీ వెలుగులోకి రావడంతో ఈ కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది...
- రిషితేశ్వరి మృతి కేసులో అరెస్టులు లేనట్లే?
సాక్షి, గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి రాసిన రెండో డైరీ వెలుగులోకి రావడంతో ఈ కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు విద్యార్థులతోపాటు మరో ఇద్దరు విద్యార్థుల పేర్లు ఇందులో స్పష్టంగా రాసి ఉన్నాయి. దీంతో వారి పాత్రపై కూడా విచారణ ప్రారంభించాల్సి ఉండగా పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మిగతా ఇద్దరు విద్యార్థులు కేవలం ప్రేమిస్తున్నట్లు మాత్రమే చెప్పారని, ఆమె మృతికి కారణమయ్యేంత వేధింపులకు వారు పాల్పడలేదని భావిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు దాదాపు పూర్తయిందని, మిగతా విద్యార్థులు, ప్రిన్సిపాల్ పాత్రపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదనే అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఇకపై ఎలాంటి అరెస్టులు ఉండబోవనే వాదన పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ మేరకు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపిన నాగార్జున వర్సిటీ నిజ నిర్ధారణ కమిటి, ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ.. రిషితేశ్వరిపై ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థులకు ప్రిన్సిపాల్ బాబూరావు అండ ఉందని తేల్చాయి. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. వర్సిటీని సందర్శించిన వైఎస్సార్‌సీపీ నిజ నిర్ధారణ కమిటీ ఎదుట అప్పటి ఇన్‌చార్జి వీసీ సాంబశివరావు, రిజిస్ట్రార్ రాజశేఖర్‌లు ప్రిన్సిపాల్‌పై లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.