
సోనియా ఆశీస్సులున్నంత వరకూ నేనే సీఎం
ఫరీదాబాద్/న్యూఢిల్లీ: హర్యానా ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భూపిందర్ సింగ్ హూడా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల విశ్వాసం ఉన్నంత వరకు హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత్రిని శనివారం కలుసుకోవడంపై విలేకరులు ప్రశ్నించగా... రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై మాట్లాడేందుకే కలిసినట్లు వివరించారు. రాష్ట్రంలో సీఎల్పీ, పార్టీ నాయకత్వాలను మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ శనివారం స్పష్టం చేసిన నేపథ్యంలో హూడా కూడా ఇదే తీరులో స్పందించడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.
గొగోయ్‌కు పదవీ గండం!
అస్సాం సీఎంగా తరుణ్ గొగోయ్‌ను తప్పించాలన్న బలమైన డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ ఏదో ఒకటి తేల్చనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో గొగోయ్‌ను తప్పించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి హిమంతబిశ్వ శర్మ పార్టీపై ఒత్తిడి పెంచారు. కాంగ్రెస్‌కు సభలో 78 మంది సభ్యుల బలం ఉండగా, అందులో 45 మంది మద్దతు తమకు ఉందని హిమంత వర్గం చెబుతోంది. దీంతో పార్టీ చీలిపోకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ గొగోయ్‌ను తప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే గౌహతి పర్యటన తర్వాత ఈ విషయమై స్పష్టత రావచ్చని తెలుస్తోంది.