కార్యదర్శుల చర్చలకు నో | No negotiations between envoys on J&K issue | Sakshi
Sakshi News home page

కార్యదర్శుల చర్చలకు నో

Published Thu, Aug 18 2016 1:28 AM | Last Updated on Sat, Oct 20 2018 5:55 PM

No negotiations between envoys on J&K issue

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ అంశంపై విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్వహించాలన్న పాకిస్తాన్‌ ప్రతిపాదనను భారత్‌ తిరస్కరించింది. ఇస్లామాబాద్‌తో సంబంధాల విషయంలో ఉగ్రవాదం కీలకంగా మారిందని, పాక్‌ వైఖరి ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి అడ్డంకిగా మారిందని ఆరోపించింది. కశ్మీర్‌పై చర్చించేందుకు తమ దేశానికి రావాలని పాక్‌ సోమవారం భారత్‌ను ఆహ్వానించడం తెలిసిందే.

దీనికి ప్రతిస్పందనగా పాక్‌కు భారత్‌ రాసిన లేఖను అక్కడి భారత రాయబారి గౌతమ్‌ బాంబావాలే ఆ దేశ విదేశాంగ శాఖకు అందించారు. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులు భారత అంతర్గత వ్యవహారమని, దీనిలో కలుగజేసుకునే అధికారం పాక్‌కు లేదని లేఖలో తేల్చిచెప్పారు. సీమాంతర ఉగ్రవాదం, చొరబాట్లపై మాత్రం పొరుగుదేశం చర్యలు తీసుకోవాలన్నారు. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల చర్చల్లో ఉగ్రవాదంఎజెండాగా ఉండాలని భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితులపై ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ జెద్‌రాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనకు తమ బందానికి అనుమతివ్వాలని ఇరు దేశాలను కోరారు.

‘సార్క్‌కు ప్రధాని’పై సరైన సమయంలో నిర్ణయం’
 ఈ ఏడాది నవంబరులో జరగనున్న 19వ సార్క్‌ సదస్సు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు  వెళ్తారా లేదా అనేది విధాన నిర్ణయమనీ, సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై భారత్‌–పాక్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.


రాష్ట్రపతిని కలవనున్న కశ్మీర్‌ ప్రతిపక్షాలు
జమ్మూకశ్మీర్‌ రావణ కాష్టంలా రగులుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలసి వివరించాలని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి.  భద్రతా దళాల చర్యలపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్‌ చేయాలని తీర్మానించాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సీపీఎం పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బందాన్ని ఢిల్లీ పంపి అన్ని పక్షాలతో చర్చించేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement