
మీడియాను నియంత్రించే ఆలోచన లేదు : జవదేకర్
మీడియాను నియంత్రించేందుకు కొత్త ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయడం లేదని సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. మంగళవారం సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మీడియాకు తన బాధ్యత ఏంటో తెలుసన్నారు. అలాగే తనకు తాను నియంత్రించుకునే శక్తి మీడియాకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
దేశం పురోగతి సాధించే క్రమంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. అందులో మీడియా సహకారం కూడా ముఖ్యమన్నారు. 2005 నుంచి బీజేపీ అధికార ప్రతినిధిగా ప్రకాశ్ జవదేకర్ వ్యవహరిస్తున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గ్లోబ్ ఇండియా చాప్టర్కు అధ్యక్షుడిగా జవదేకర్ వ్యవహరిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో సమాచార మరియు ప్రసార శాఖను ప్రకాశ్ జవదేకర్ అప్పగించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్గా ప్రకాశ్ జవదేకర్ ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే.