
ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ‍్యంలో అయోధ్య అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని బీజేపీ వివాదాస్పద ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. ఈ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, అవి త్వరలోనే పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో మందిరాన్ని నిర్మిస్తామని అన్నారు.
రామమందిర నిర్మాణానికి ఓ మతానికి సంబంధించినవారు కూడా మద్దతు ఇచ్చారని సాక్షి మహరాజ్ తెలిపారు. ఆ మతానికి చెందిన 60 లక్షలమంది ఇప్పటికే మద్దతు ఇచ్చారని, మందిర నిర్మాణానికి ఎవరైనా అభ్యంతరం చెబుతారని తాను భావించడంలేదన్నారు. ఇక యూపీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామని సాక్షి మహరాజ్ ధీమా వ్యక్తం చేశారు.