
'పోలీసులది తప్పని తేలితే కఠిన చర్యలు'
న్యూఢిల్లీ: శేషాచలం ఎదురు కాల్పుల అంశంపై రాజ్యసభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ప్రతిపాదన లేనందున కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎలాంటి దర్యాప్తు చేయించలేమని చెప్పారు. ఎదురుకాల్పులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని తెలిపారు. ఏపీ సర్కారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించిందని అన్నారు.
ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పోలీసులది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. శేషాచలం ఎన్కౌంటర్ పై చంద్రగిరి పీఎస్ లో ఏప్రిల్ 7న మధ్యాహ్నం 12.30 గంటలకు కేసు నమోదైందని రాజ్ నాథ్ తెలిపారు.
చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో ఈ నెల 7న జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.