
ఎంబీబీఎస్ పొడిగింపు లేదు: ఆజాద్
ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితిని పెంచే విషయంలో తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితిని పెంచే విషయంలో తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ కాలపరిమితిని 5.5 ఏళ్ల నుంచి 6.5 ఏళ్లకు పెంచనున్నారన్న ఊహాగానాలు రావడంతో వైద్యవిద్యార్థులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు వివరణ ఇచ్చారు.
పీజీ కోర్సులో చేరే ఎంబీబీఎస్ విద్యార్థులు ఒక ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించి ఉండాలన్న నిబంధనతో భారత వైద్య మండలి (ఎంసీఐ) జారీ చేసిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎంబీబీఎస్ కాలపరిమితి పెంపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థుల ప్రతినిధులతో గురువారమిక్కడ ఆజాద్ మాట్లాడారు. కోర్సు కాలపరిమితిని పెంచే ప్రతి పాదన లేదని చెప్పారు. 2015-16వ సంవత్సరంలో పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారికి గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది వైద్య సేవల నిబంధన తప్పనిసరి కాబోదని కూడా ఆజాద్ భరోసా ఇచ్చారు.