సమైక్య ఊసే వద్దు: బొత్స సత్యనారాయణ | No united state, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

సమైక్య ఊసే వద్దు: బొత్స సత్యనారాయణ

Published Sun, Aug 18 2013 3:10 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

సమైక్య ఊసే వద్దు: బొత్స సత్యనారాయణ - Sakshi

సమైక్య ఊసే వద్దు: బొత్స సత్యనారాయణ

‘‘రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం జరిగిపోయింది. ఈ విషయంలో ఇక వెనక్కు పోయే ప్రసక్తే లేదు. ఇకపై సమైక్యమనే ఊసే వద్దు. విడిపోతే సీమాంధ్రలో ఎదురయ్యే సమస్యలను మాత్రమే చెప్పండి. ఇది నా మాట కాదు... హైకమాండ్ మాటగా చెబుతున్నా’’    
 - పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ
 
 ‘‘మా అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడానికి హైకమాండ్ ఎవరు? నిర్ణయం తీసుకున్నాక ఇక మాతో పనేముంది? మమ్మల్ని ఇక్కడికెందుకు పిలిచినట్టు? ఆంటోనీ కమిటీ వద్దకు వెళ్లి ఏం చేయాలి? హైకమాండ్ మాటలు మోసుకొచ్చే బదులు మీరెందుకు వాళ్లకు నచ్చజెప్పలేదు? హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అయితే పార్టీలో ఎవరూ ఉండరు. ఎవరి దారి వారే చూసుకుంటారు’’
 - బొత్సపై సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ధ్వజం
 
 ‘‘విభజన విషయంలో తొందర పడాల్సిందేమీ లేదు. ఇంకా 10 శాతం కూడా ప్రక్రియ కాలేదు. మొత్తం ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం ఏడాదిన్నర పడుతుంది. కేబినెట్ నోట్ మొదలు అసెంబ్లీ, పార్లమెంటు బిల్లు, రాష్ట్రపతి ఆమోదం వరకు చాలా ప్రక్రియలున్నాయి. అసలు ప్రక్రియ ఇప్పటిదాకా మొదలే కాలేదు. విభ జిస్తే ఎన్ని సమస్యలొస్తాయో మేం చెప్పి చూశాం. ప్రజల నాడి ఎలా ఉందో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. సీమాంధ్ర ఉద్యమాల గురించి, ప్రజలు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారనే విషయాన్ని ఆంటోనీ కమిటీకి చెప్పండి. ఢిల్లీ వెళ్లకపోతే సోనియాగాంధీని, ఇతర పెద్దలను కలిసే అవకాశం ఉండకపోవచ్చు’’
 - సీమాంధ్ర నేతలను బుజ్జగించిన సీఎం కిరణ్
 
 ‘‘ఆంటోనీ కమిటీ వద్దకు 10 నుంచి 15 మంది ప్రతినిధుల బృందం వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరదాం. విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ నివేదిక అందజేద్దాం. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తే మూకుమ్మడిగా వ్యతిరేకిద్దాం. కే ంద్ర కేబినెట్‌కు తెలంగాణ బిల్లు నోట్ వస్తే కేంద్ర మంత్రులు కూడా వ్యతిరేకించాలి. అవసరమైతే వారితో రాజీనామాలు చేయించాలి’’
 - సమావేశ ముగింపు సందర్భంగా నేతల మధ్య వచ్చిన ఏకాభిప్రాయమిది. ఈ మేరకు నేతలతోపాటు కిరణ్, బొత్స కూడా తీర్మానంపై సంతకాలు చేశారు
 
 సాక్షి, హైదరాబాద్: శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఆరున్నర గంటలపాటు జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం నేతల మధ్య వాడివేడి చర్చకు వేదికైంది. 18 మంది మంత్రులు, 45 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్న సమావేశంలో ముందుగా బొత్స మాట్లాడారు. అందులో పాల్గొన్న నేతలు చెప్పిన మేరకు... హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇస్తామన్న సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెనక్కు తీసుకునే ప్రశ్నే లేదని హైకమాండ్ తనకు చెప్పిందని ఆయనన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే మాట తప్ప ఇతర సమస్యలేమైనా ఉంటే చర్చించేందుకు రావాలని కూడా సూచించిందన్నారు. తద్వారా సీమాంధ్ర ఆందోళనలను ఎలా తగ్గించాలి, ఏం చేయాలో సలహాలివ్వాలని కోరిందన్నారు. బొత్స మాటలు పూర్తయీ అవకముందే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా ఆయనపై మూకుమ్మడిగా విరుచుకుపడినట్టు తెలుస్తోంది.
 
 మంత్రులు వట్టి వసంతకుమార్, గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘మా అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడానికి హైకమాండ్ ఎవరు? వాళ్లకు ఏం తెలుసని నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం జరిగాక ఆంటోనీ కమిటీని ఎందుకు వేసినట్టు? ప్రక్రియ ఆగదని చెబుతున్నారు. అంటే ఈ కమిటీ బోగస్‌దా? దానికి విలువేమున్నట్టు? అసలే సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇకపై మేం నియోజకవర్గాలకు కూడా వెళ్లలేం. 2009 డిసెంబర్ 9న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే వెనక్కు తీసుకున్నారు.
 
 సీడబ్ల్యూసీ తీర్మానం ఎంత?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని వెనక్కు తీసుకోవాల్సిందేనని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అలాగాక హైకమాండ్ నిర్ణయమే ఫైనలంటే ఇక ఎవరి దారి వారు చూసుకుంటారంటూ కుండబద్దలు కొట్టారు. హైకమాండ్ నిర్ణయం తీసుకున్నాక ఆంటోనీ కమిటీని ఎందుకు వేశారని ప్రశ్నించడమే గాక, ఢిల్లీ వెళ్లి తామేం చేయాలని కూడా నిలదీశారు. హైకమాండ్ మాటలను మోసుకొచ్చే బదులు పీసీసీ అధ్యక్షుడిగా, సీమాంధ్ర ఎమ్మెల్యేగా వాస్తవాలను వివరించి ఢిల్లీ పెద్దలకు ఎందుకు నచ్చజెప్పలేదంటూ బొత్సపై ధ్వజమెత్తారు. హైకమాండ్ నిర్ణయం తీసుకున్నందున ఇక ఆంటోనీ కమిటీని కలవాల్సిన అవసరం కూడా తమకు లేదంటూ భీష్మించారు.
 
  సీమాంధ్ర ప్రజలకు నచ్చజెప్పి, ఆందోళనలను ఎలా కట్టడి చేయాలనే అంశాలపై సూచనలు చేయాలని హైకమాండ్ చెప్పినందునే సమావేశానికి పిలిచామని బొత్స వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా నేతలెవరూ శాంతించలేదు. దాంతో సీఎం వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘‘తొందరపడొద్దు. విభజన ప్రక్రియ ఇంకా మొదలు కానేలేదు. ప్రక్రియ మొత్తం పూర్తవాలంటే కనీసం ఏడాదిన్నర పడుతుంది. కేంద్ర కేబినెట్ నోట్ మొదలు పార్లమెంటులో బిల్లు, రాష్ట్రపతి ఆమోదం వరకు అనేక దశలున్నాయి. ఆవేశాలకు లోనుకాకుండా, విభజిస్తే ఎన్ని సమస్యలొస్తాయో హైకమాండ్‌కు చెప్పాలి. ఈ విషయంలో మేం చెప్పాల్సిందంతా చెప్పాం. ఇక క్షేత్రస్థాయిలో ప్రజల నాడి ఎలా ఉందో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. సీమాంధ్రలో ఆందోళనలెందుకు వచ్చాయో, జనం రోడ్లపైకి ఎందుకు వస్తున్నారో వివరించి హైకమాండ్‌కు నచ్చజెప్పేందుకైనా మీరు ఆంటోనీ కమిటీని కలవాలి.
 
 ఇప్పుడు ఆ కమిటీని కలవకపోతే భవిష్యత్తులో సోనియాగాంధీ, ఇతర పెద్దలను కలిసే అవకాశాన్ని కోల్పోతాం’’ అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. వట్టి, వరప్రసాద్ తదితరులు ఆగ్రహంతో సమావేశం నుంచి మధ్యలోనే నిష్ర్కమించగా, మిగతా నేతలు మాత్రం శాంతించినట్టు తెలిసింది. దాంతో ఒక్కో నేతనూ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కిరణ్, బొత్స కోరారు. నేతలంతా సమైక్యవాదం విన్పించినా...అనంతపురం, కర్నూలు జిల్లా నేతలు మాత్రం రాయల తెలంగాణ ప్రతిపాదన చేశారు! ముఖ్యంగా ఏరాసు, జేసీ, అనంతపురం డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా తాము రాయల తెలంగాణకే మొగ్గు చూపుతున్నామని స్పష్టం చేశారు.

వెంటనే గాదె లేచి, ‘‘మీరు రాయల తెలంగాణ అనడం వల్ల సమైక్య నినాదం నీరుగారిపోతోంది. దయచేసి అందరం ఒకే మాట మీద నిలబడదాం’’ అని కోరారు. జేసీ స్పందిస్తూ, ఆంటోనీ కమిటీ వద్ద తాము సమైక్య వాదానికే కట్టుబడి ఉంటామని చెబుతామన్నారు. ఒకవేళ కుదరదని చెబితే మాత్రం కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేయాలని కోరతామని స్పష్టం చేశారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నేతలంతా ఇప్పటికే రాయల తెలంగాణ కోరుతూ సోనియాగాంధీకి వినతిపత్రం కూడా ఇచ్చారని ఏరాసు గుర్తు చేశారు. దాంతో నేతల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులంతా రాజీనామా చేస్తే తప్ప హైకమాండ్ దిగిరాదన్న భావన వ్యక్తమైంది.
 
  కేంద్ర కేబినెట్ వద్దకు తెలంగాణ నోట్ వస్తే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులంతా రాజీనామా చేయాలని, పార్లమెంటులో బిల్లు వస్తే సీమాంధ్ర ఎంపీలూ రాజీనామా చేయాలని, అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించి మంత్రులు, ఎమ్మెల్యేలంతా పదవుల నుంచి తప్పుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఏకాభిప్రాయం రాకపోవడమే గాక సమావేశంలో గందరగోళం నెలకొనడంతో కిరణ్ జోక్యం చేసుకున్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అందరూ కోరండి. ఇప్పుడు హైకమాండ్‌పై ఒత్తిడి తేకపోతే తరవాత అసలే మాట వినే పరిస్థితి లేదు’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం రూపొందించడంతో పాటు సీఎం, పీసీసీ చీఫ్ కూడా దానిపై సంతకం చేశారు.
 
 అదే సమయంలో ఢిల్లీకి నేతలంతా కాకుండా 15 మందికి మించకుండా బృందంగా వెళ్లాలని నిర్ణయించారు. మంత్రుల తరఫున శైలజానాథ్, గంటా, ఏరాసు, ఎమ్మెల్యేల తరఫున గాదె, జేసీ, మధుసూదన్ గుప్తా, ఎమ్మెల్సీల తరపున పద్మరాజు తదితరులు కమిటీ ముందు హాజరవాలని నిర్ణయించారు. దీంతోపాటు సీమాంధ్రలో శాంతియుతంగా ఆందోళన చేయాలని ప్రజలను కోరుతూ మరో తీర్మానం చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించాలని కూడా విజ్ఞప్తి చేద్దామని బొత్స ప్రతిపాదించగా నేతలు వ్యతిరేకించారు. వారికి ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలా విజ్ఞప్తి చేస్తామని ప్రశ్నించడంతో బొత్స మిన్నకుండిపోయారు. అనంతరం పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ, సమైక్యవాదాన్ని విన్పించేందుకు ఈ నెల 20న ఢిల్లీకి ప్రతినిధి బృందంగా వెళ్లాలని తీర్మానించినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement