రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో వినిపించని ‘తెలంగాణం’
సాక్షి, హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన సందేశాల్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై ఆ ప్రాంత కాంగ్రెస్‌నేతల్లో పలురకాల అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ భాగస్వామ్యపక్షాల ఏక గ్రీవ తీర్మానాలతో ప్రత్యేక రాష్ట్రంపై గంపెడాశలు పెట్టుకున్న నేతలను ఇప్పుడీ పరిణామం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనట్లు రాజ్యసభలో ఆర్థికమంత్రి పి.చిదంబరం ఇటీవలే స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. కేంద్ర న్యాయశాఖ ఇందుకు సంబంధించిన నోట్‌ను ప్రిపేర్ చేస్తున్నట్లు చెప్పారు. గత వారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకుంటారని అంతా ఎదురుచూశారు.
అయితే న్యాయశాఖనుంచి నోట్ రూపొందకపోవడంతో ఆ కేబినెట్లో తెలంగాణ అంశాన్ని చేర్చలేదన్నట్లు వార్తలు వచ్చాయి. ఈనెల 17న కేంద్ర కేబినెట్ సమావేశం జరగనున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వామ్యపక్షాలు తెలంగాణపై చేసిన తీర్మానంతో సీమాంధ్ర ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్యమం ఉధృతమై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిణామం గా మారింది. సీమాంధ్ర ఉద్యమసెగలతో పార్లమెంటు సమావేశాలు కూడా ముందుకు సాగడం లేదు. యూపీఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహారభద్రతా బిల్లుపై చర్చ కూడా నిలిచిపోయింది. తెలంగాణ అంశంపై సీడబ్ల్యూసీ, యూపీఏ భాగస్వామ్యపక్షాల సమన్వయ కమిటీ స్పష్టతలేని నిర్ణయం వల్లనేఇలాంటి పరిస్థితులు వచ్చాయని కాంగ్రెస్‌లోని సీమాంధ్ర నేతలతో సహా అన్ని విపక్షాలు మండిపడుతున్నాయి. స్పష్టత వచ్చేవరకు తొందరపాటు వద్దని సూచనలు వచ్చాయి. ఈ తరుణంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు తెలంగాణ ప్రక్రియను ఆపాలని సీమాంధ్ర నేతలనుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో రాష్ట్రపతి, ప్రధాని తెలంగాణ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో తెలంగాణ నేతల్లో మరింతగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చారు. అప్పట్లో లోక్‌సభలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించిన ప్రణబ్‌ముఖర్జీ చేసిన ఉపన్యాసంలో తెలంగాణ గురించి ప్రస్తావించారు.
ఇప్పుడు సీడబ్ల్యూసీ తీర్మానం, దానికి యూపీఏ భాగస్వామ్య పక్షాల ఆమోదం లభించి నా రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో ఆ అంశం లేకపోవడం వెనుక కారణమేమై ఉంటుందన్న చర్చసాగుతోంది. సీమాంధ్ర లో ఉద్యమం, రాష్ట్రం లో తీవ్ర అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న తరుణంలో తెలంగాణపైతాత్సారం చేయాలన్న ఉద్దేశమేమైనా ఉండొచ్చని కొందరు నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో తెలంగాణ అం శాన్ని చేరిస్తే అది ఉద్యమాన్ని మరింతగా పెంచి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుందేమోనన్న ఉద్దేశంతోనే చేర్చి ఉండకపోవచ్చన్న అభిప్రాయం కొందరు తెలంగాణ నేతలు వినిపిస్తున్నారు. అయితే సాధారణ ఎన్నికలకు ఎంతో సమయం లేని తరుణంలో తెలంగాణ ప్రక్రియ ఆలస్యమైతే చివరి నిమిషంలో పూర్తిగా నిలిచిపోతుందేమోనన్న భయం కూడా మరికొందరిలో ఏర్పడుతోంది. సీమాంధ్ర నేతలు మాత్రం తమ ఒత్తిడి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఒకింత వెనక్కు తగ్గుతోందని, ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో చేర్చకపోవ డానికి కారణమిదే కావచ్చని చెబుతున్నారు.