
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
మలేసియన్లపై ఉత్తరకొరియా తాత్కాలిక నిషేధం
ప్యాంగ్‌యాంగ్: అమెరికా సహా ఏ దేశాన్నైయినా ధిక్కరించే ఉత్తరకొరియా.. మలేసియాతో తగువు పెట్టుకుంటోంది. ఇరు దేశాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తమ దేశం నుంచి మలేసియన్లు వెళ్లకుండా ఉత్తరకొరియా తాత్కాలిక నిషేధం విధించింది. మలేసియాలోని తమ దేశ పౌరులు, దౌత్యవేత్తల రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. ప్యాంగ్‌యాంగ్‌లోని మలేసియా దౌత్య కార్యాలయానికి ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విషయం సానుకూలంగా పరిష్కారమవుతుందని, మలేసియాతో దౌత్యసంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నామని పేర్కొంది.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు (సవతి తల్లి కొడుకు) కిమ్ జోంగ్ నామ్ మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఉన్ ఈ హత్య చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. నామ్ మృతదేహాన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మలేసియా ఉద్దేశ్యపూర్తకంగానే కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ, నామ్ మృతదేహానికి శవపరీక్షలు చేయడంపై ఉత్తరకొరియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో మలేసియన్లు దేశం విడిచి వెళ్లకుండా ఉత్తరకొరియా నిషేధం విధించింది.