కొలిక్కి రాని ‘ఎమ్మెల్సీ’ చర్చలు | Not signed, 'MLC' discussions | Sakshi
Sakshi News home page

కొలిక్కి రాని ‘ఎమ్మెల్సీ’ చర్చలు

Published Mon, Nov 30 2015 2:16 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Not signed, 'MLC' discussions

* తమ ప్రతిపాదనలు టీఆర్‌ఎస్ ముందుంచిన కాంగ్రెస్
* కేసీఆర్‌తో చర్చించి చెబుతామన్న అధికార పార్టీ ప్రతినిధులు
* ఇరుపక్షాలకు కీలకంగా మారిన నల్లగొండ స్థానం

సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా నుంచి శాసన మండలికి 12 స్థానాల కోసం జరగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డితో టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చర్చలు కొనసాగిస్తున్నారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు.

అవగాహన కుదరాలంటే కాంగ్రెస్ ప్రతిపాదనలు ఏమిటని టీఆర్‌ఎస్ ప్రతినిధులు అడిగినట్టుగా తెలిసింది. ఇందుకు రెండు స్థానాలున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల నుంచి ఒక్కొక్క స్థానంతో పాటు నల్లగొండను కాంగ్రెస్‌కు ఇవ్వాలని జానారెడ్డి, షబ్బీర్‌అలీ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై తమ అధినేత కేసీఆర్‌తో చర్చించిన తర్వాత చెబుతామని టీఆర్‌ఎస్ నేతలు వారికి తెలిపారు.
 
నల్లగొండపై రెండు పార్టీల కన్ను: టీఆర్‌ఎస్, కాంగ్రెస్ చర్చల్లో నల్లగొండ స్థానం కీలకంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత జానారెడ్డి నల్లగొండ జిల్లాకు చెందినవారే కావడంతో ఆ జిల్లా శాసన మండలి స్థానం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. జిల్లాలో ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉం డటంతోపాటు పార్టీ నుంచి గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ల మెజారిటీ ఉంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరినా... మండలి ఎన్నికల్లో ఓట్లు వేస్తామని తమ ‘గాడ్‌ఫాదర్ల’కు చెప్పారని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బలాన్ని కూడగట్టుకోవడానికి ఓటర్లతో ఆరునెలలుగా సమావేశాలు జరుపుతున్నారు. మరోవైపు సీఎంకు అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి జి.జగదీశ్‌రెడ్డికి కూడా ఇదే నల్లగొండ స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్సీని గెలిపించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటినట్టుగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
 
తక్షణమే ఢిల్లీకి రండి
ఉత్తమ్, జానా, షబ్బీర్‌కు దిగ్విజయ్ ఆదేశం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీని తక్షణమే ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు అందాయి. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆదేశించారు. ఆదివారం ఈ మేరకు వారికి ఫోన్ చేశారు. శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన నివేదికతో రావాలని ఉత్తమ్‌కు సూచించారు.

దీంతో డీసీసీల నుంచి ఆయన నివేదికలు తెప్పించుకున్నారు. ఆదివారం రాత్రి వరకు మెదక్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పూర్తిస్థాయి నివేదికలు అందినట్టుగా తెలిసింది. పార్టీ నేతలు ముందుగా దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమై మండలి ఎన్నికల వ్యూహంపై చర్చిస్తారు. అనంతరం అధినేత్రి సోనియా, రాహుల్‌గాంధీతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. మండలి ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వరంగల్ పరాజయంపైనా సమీక్షించే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement