లేడీ గగాతో ఫొటో దిగడం ఇక ఈజీ | Now it is Easy thing to do photo shoot with lady gaga | Sakshi
Sakshi News home page

లేడీ గగాతో ఫొటో దిగడం ఇక ఈజీ

Published Thu, Jan 19 2017 6:58 PM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

లేడీ గగాతో ఫొటో దిగడం ఇక ఈజీ - Sakshi

లేడీ గగాతో ఫొటో దిగడం ఇక ఈజీ

న్యూఢిల్లీ: అమెరికా ప్రముఖ పాప్‌ సింగర్‌ లేడీ గగా భుజం మీద చేతులేసి నిలబడి, ఆమె పక్కన నడుం పట్టుకొని ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆమె అభిమానులంతా పోటీ పడ్డారు. మరో పక్క బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తో ఫొటోలు దిగేందుకు కూడా ఆయన అభిమానులు అలాగే పోటీ పడ్డారు. మీడియా కెమేరామేన్‌లు కూడా ఇద్దరు సెలబ్రిటీలను తమ ఫ్లాష్‌ లైట్లతో వివిధ భంగిమల్లో ఫొటోలు తీస్తూ సందడి చేశారు. అయినా వారిద్దరు తమ భంగిమలను మార్చుకోకుండా, కదలకుండా మెదలకుండా, కళ్లు కూడా ఆర్పకుండా తమ అభిమానులను అలరించారు. 
 
నిజంగా లేడీ గగా, అమితాబ్‌ బచ్చన్‌లు ఇక్కడికి రాలేదు. వారి మైనపు బొమ్మలు మాత్రమే వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 'మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం' అనుబంధ శాఖను ఢిల్లీ కన్నాట్‌ ప్లేస్‌లో ఏర్పాటు చేసేందుకు వాటిని ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రఖ్యాతి చెందిన సెలబ్రిటీల మైనపు బొమ్మలతోపాటు భారత సెలబ్రిటీలందరి మైనపు బొమ్మలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంలో భారతీయులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అందరి మైనపు బొమ్మలను ప్రధాన వర్క్‌ షాపున్న లండన్‌ మ్యూజియంలోనే తయారు చేసి ఇక్కడికి తీసుకొస్తామని తెలిపారు. అయితే లండన్‌ మ్యూజియంలోలాగా 'చేంబర్‌ ఆఫ్‌ హార్రర్స్' మాత్రం ఇక్కడుండదని చెప్పారు. 
 
'చేంబర్‌ ఆఫ్‌ హార్రర్స్'  వెనక ఎంతో ఆసక్తికరమైన చరిత్రే ఉంది. దాదాపు 200 సంవత్సరాల క్రితం అన్నే మేరీ టుస్సాడ్స్‌ నేతృత్వంలో లండన్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ఏర్పాటయింది. ఓ ఫిలిప్పీ కళాకారుడి ఇంట్లో పనిచేస్తూ  మైనం లేదా ప్లాస్టర్‌తో బొమ్మలను తయారు చేయడం నేర్చుకున్న అన్నే మేరీ, ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్‌ విప్లవం సందర్భంగా చనిపోయిన వారి ముఖాల మాస్కులను తయారు చేసేవారు. ఆమె చెక్కిన మైనపు శిల్పాలను చూసి అబ్బురపడిన ఫ్రెంచ్‌ రాజు 16వ లూయీ తన సోదరికి ఆ కళను నేర్పించేందుకు అన్నేను ట్యూటర్‌గా నియమించారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆమె రాజప్రాసాదంలోనే నివసించారు. 1790 దశకంలో ఫ్రెంచ్‌ విప్లవం సందర్భంగా ఆ రాజవంశాన్ని హతమార్చిన ఫ్రెంచ్‌ విప్లవకారులు ఆమెను జైల్లో నిర్బంధించారు. 
 
అప్పుడు ఆమెను ఉరితీసేందుకు ఆమెకు గుండు కూడా గీసి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే తాను రాజకుటుంబానికి చెందిన వ్యక్తిని కాదని, కేవలం ట్యూటర్‌నని, తనను వదిలిపెట్టాలని ఆమె విప్లవకారులను వేడుకున్నారు. తమ విప్లవానికి ఏదోరకంగా ఉపయోగపడితేనే తర్వాత వదిలేస్తామని వారు షరతు విధించారు. ఆమె తనకు వచ్చిన కళ గురించి చెప్పగానే, అయితే తాము విప్లవంలో చంపుతున్న వారి ముఖాల మాస్కులను తయారు చేసి ఇవ్వాలని సూచించగా అలాగే చేశారు. అందుకోసం ఆమె విప్లవకారుల వెంట వెళ్లాల్సి వచ్చేది. భయానకంగా ఉన్న శవాల ముఖాలను క్షుణ్నంగా పరిశీలించి ముఖ కవలికలు దెబ్బతినకుండా మాస్కులను తయారు చేయాల్సి వచ్చేది.
 
అందులో భాగంగా ఆమె ఫ్రెంచ్‌ రాజు 16వ లూయీ, విప్లవకారుల చేతుల్లో మరణించిన ఆఖరి రాణి మేరీ అంటాయినెట్టీ మాస్క్‌లను కూడా తయారు చేసి ఇచ్చారు. ఆ నాడు తాను కళ్లతో చూసిన భయానక దృశ్యాల జ్ఞాపకంగా ఆమె లండన్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో 'చేంబర్‌ ఆఫ్‌ హార్రర్స్'  ఏర్పాటుచేసి అందులో 16 లూయీతోపాటు వారి బంధువులు, ఇతరుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాటికి ఆమె కరుడు గట్టిన నేరస్థులు, హంతకుల మైనపు బొమ్మలను కూడా చేర్చారు. 
 
ఫ్రాన్స్‌ నుంచి ఇంగ్లండ్‌ బయల్దేరి వచ్చిన అన్నే మేరీ అక్కడ దేశమంతా తిరుగుతూ లండన్‌లో స్థిరపడ్డారు. లండన్‌లోని బేకర్‌ స్ట్రీట్‌లో తొలి మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఆమె పేరు మీదగానే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంగా దానికి పేరొచ్చింది. ఆ తర్వాత కాలంలో ప్రపంచంలోని పలు నగరాల్లో దానికి అనుబంధ శాఖలుగా టుస్సాడ్‌ మ్యూజియంలు ఏర్పాటవుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఢిల్లీలోని కన్నాట్‌ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో కర్దాషియన్‌ లాంటి అంతర్జాతీయ సింగర్లతోపాటు ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్‌ అందాల తారలు,  సచిన్‌ టెండూల్కర్, ధోని లాంటి క్రికెట్‌ దిగ్గజాల మైనపు బొమ్మలను త్వరలోనే ఏర్పాటు చేస్తారట. అప్పుడు అభిమానులు తమ సెలబ్రిటీలతో అచ్చంగా ఫొటోలు దిగవచ్చు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement