ఆ ముగ్గురు మూడు దిక్కులు!
పాట్నా: బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. దగ్గరనుకున్నవారు దూరం అవుతున్నారు. దూరం అనుకున్నవారు దగ్గరవుతున్నారు. ఈ నెల 19న(శనివారం) రాహుల్ గాంధీ భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా దానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డుమ్మాకొడుతున్నారు. తాను పలువురు ప్రతినిధులకు అపాయింట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో హాజరుకాలేనని పైకి ఆయన చెబుతున్నా.. లోలోపల మాత్రం అసలు ఆ ర్యాలీకే హాజరుకాకుడదని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదంట.
తన కుమారుడు తేజస్వి రాహుల్ కార్యక్రమానికి వస్తాడని లాలూ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలిసింది. ఇక జేడీయూ తరుపున కేసీత్యాగి పలువురు రాహుల్తో వేదిక పంచుకుంటున్నారని ఆయన మీడియా ప్రతినిధులు తెలిపారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే నిర్ణయంతో జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి జనతా పరివార్ గా, లౌకిక కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో తొలుత పెద్ద దిక్కుగా ఉన్న ములాయం సింగ్ బయటకు వెళ్లిపోవడంతోనే మిగతా పార్టీలకు కొంత అసంతృప్తి కలిగినట్లు తెలిసింది. ఇప్పుడు తాజాగా నితీశ్, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ ఒకరికి ఒకరు సరిగా సహకరించుకుపోవడం చూస్తుంటే వీరి కూటమి ఎన్నికల కడవరకు కొనసాగేనా అని అనుమానం నెలకొంది.