Published
Mon, Sep 9 2013 4:34 AM
| Last Updated on Thu, Apr 4 2019 3:20 PM
వాషింగ్టన్: రిమోట్ కంట్రోల్‌లతో ఎంత హాయో చెప్పనక్కర్లేదు. కూర్చున్నచోటి నుంచే టీవీలు, మ్యూజిక్
సిస్టమ్‌లు, ఫ్యాన్లు, లైట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కార్లు, ద్విచక్రవాహనాలను కూడా నియంత్రించవచ్చు. మరి మనం అల్లారుముద్దుగా పెంచుకునే కుక్కల వంటి పెంపుడు జంతువులను కూడా రిమోట్‌తో నియంత్రించగలిగితే..!? అమెరికాలోని ఓబర్న్ యూనివర్సిటీ పరిశోధకులు అలాంటి ఓ పరికరాన్ని రూపొం దించారు. ఇందులో ఒక మైక్రో ప్రాసెసర్, వైర్‌లెస్ రేడియో, జీపీఎస్ రిసీవర్ వంటివి ఉంటాయి.
మన పెంపుడు కుక్కలకు అలవాటైన, ముందుగానే శిక్షణ ఇచ్చిన పిలుపులు, కమాండ్లను ఆ పరికరంలో పొందుపరుస్తారు. పెంపుడు కుక్కలు దూరంగా ఉన్నప్పుడు జీపీఎస్ సహాయంతో అవి ఎక్కడికి వెళ్లాలి.. ఎలా రావాలి.. ఏం చేయాలి? తదితర విషయాలను మన దగ్గర ఉండే పరికరం ద్వారా ఆదేశించవచ్చు.
అయితే, ఈ పరికరం ద్వారా ఇచ్చిన ఆదేశాలను పెంపుడు కుక్కలు 98 శాతం కచ్చితత్వంతో పాటించాయని పరిశోధనకు నేతృత్వం వహించిన జెఫ్ మిల్లర్ చెప్పారు. యజమానులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాటిని నేరుగా నియంత్రించలేనంత దూరంలో ఉన్నప్పుడు ఈ పరికరం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.