భారత్‌పై ఉగ్రదాడికి కుట్ర.. అమెరికాలో ఎన్నారైకి 15 ఏళ్ల జైలు
భారతదేశం మీద ఉగ్రదాడి చేసేందుకు కుట్ర పన్నిన నేరం రుజువు కావడంతో అమెరికాలో ఉంటున్న ఓ ఎన్నారైకి అక్కడి కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఖలిస్థాన్ ఉద్యమంలో భాగంగా ఓ భారత ప్రభుత్వాధికారిని చంపేందుకు కూడా అతడు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. దాంతో బల్వీందర్ సింగ్ (42) అనే ఎన్నారైకి అమెరికా జిల్లా జడ్జి లారీ హిక్స్ 180 నెలల జైలు శిక్ష విధించారు. ఉగ్రవాదులకు కేవలం మద్దతు ఇవ్వడం, కుట్ర పన్నడమే కాక.. వాళ్లకు కావల్సిన వనరులను కూడా ఇతడు సమకూర్చినట్లు తేలింది. రెనో ప్రాంతానికి చెందిన బల్వీందర్ సింగ్ రెండు ఉగ్రవాద గ్రూపులలో సభ్యుడని, భారత ప్రభుత్వాన్ని వణికించేందుకు, అక్కడి అమాయక ప్రజలను హతమార్చేందుకు కావల్సిన సామగ్రిని ఇతడు వాళ్లకు అందించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
ఇతడికి బల్జీత్ సింగ్, ఝాజీ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. అమెరికాలో శాశ్వత నివాస హోదా ఉంది. 2013 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య ఇతడు ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఉగ్రవాద దాడులు చేయడానికి కావల్సిన సామగ్రి అందించాడని చెబుతున్నారు. కాలిఫోర్నియా జైల్లో ఉన్న మరో కుట్రదారుడిని కలిసేందుకు ఇతడు తరచు రెనో నుంచి కాలిఫోర్నియా వెళ్లేవాడన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు భారతదేశానికి వెళ్లి, అక్కడ ఒక భారత ప్రభుత్వాధికారిని చంపడంతో పాటు ఉగ్రవాద దాడులు కూడా చేయాలని 2013 అక్టోబర్‌లో వీళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు.
2013 నవంబర్ నెలలో బల్వీందర్ సింగ్ రెండు నైట్ విజన్ గాగుల్స్, ఒక ల్యాప్‌టాప్ కొని తన సహచరుడికి ఇచ్చాడు. అతడు శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు డిసెంబర్‌లో ప్రయత్నించాడు గానీ.. అమెరికా అధికారులు విమానాశ్రయంలోనే పట్టుకున్నారు. అతడిని విచారించగా బల్వీందర్ విషయం తెలిసింది.