ముంబై : కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు కొత్త డిప్యూటీ గవర్నర్ ను నియమించింది. ఆర్ బీఐ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న ఎన్ఎస్ విశ్వనాథన్ ను కొత్త డిప్యూటీ గవర్నర్ గా నియమిస్తూ ప్రభుత్వ ప్యానల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఈ పదవిలో ఉన్న హెచ్ఆర్ ఖాన్ జూలై 3తో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియమకాన్ని చేపట్టింది.
బ్యాకింగ్, బ్యాకింగేతర డిపార్ట్ మెంట్లను విశ్వనాతన్ పర్యవేక్షిస్తుండగా.. ఫైనాన్సియల్ మార్కెట్లు, బాహ్య పెట్టుబడులు, కార్యకలాపాలు, పేమెంట్లు, సెటిల్ మెంట్లు, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, ఫారెన్ ఎక్సేంజ్, ఇంటర్నల్ డెట్ మేనేజ్ మెంట్లు హెచ్ఆర్ ఖాన్ నేతృత్వంలో జరుగుతున్నాయి. జూలై 3 అనంతరం ఈ బాధ్యతలను విశ్వనాథన్ స్వీకరించనున్నారు. ఆర్ బీఐకి నలుగురు డిప్యూటీ గవర్నర్లుగా వ్యవహరిస్తుంటారు.
కాగా ఆర్ బీఐ గవర్నర్ గా రెండోసారి కొనసాగలేనని రఘురాంరాజన్ స్పష్టంచేయడంతో ఆ పదవిలోకి ఎవరొస్తారన్న ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే అనేక పేర్లు వినిపించినప్పటికీ.. రాజన్ తర్వాత ఆర్ బీఐ గవర్నర్ స్థానంలో ఉండే అభ్యర్థుల జాబితాను నలుగురికి పరిమితం చేసింది. వీరిలో ఎస్ బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేరుతో పాటు.. రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేశ్ మోహన్, సుబీర్ గోకర్న్ ను కేంద్రం పరిశీలిస్తోంది.