రుణాలకు తాకట్టుగా న్యూడ్ సెల్ఫీలు.. లీక్!
బీజింగ్: ఆన్‌లైన్‌లో రుణాల కోసం తాకట్టు పెట్టిన మహిళల నగ్నఫొటోలు, వీడియోలు తాజాగా వెలుగుచూడటం చైనాలో కలకలం రేపుతోంది. ఆన్‌లైన్‌లో అప్పులు ఇచ్చేందుకు జెడీ క్యాపిటల్ అనే సంస్థ 2015లో జీడాయ్‌బావో అనే ఇంటర్నెట్ వేదికను ప్రారంభించింది. ఈ వేదికలో అప్పులు ఇచ్చేవారు తమ వివరాలను రహస్యంగా ఉంచుతారు. అప్పులు తీసుకునేవాళ్లు మాత్రం తమ పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు దుర్మార్గులు వారి నగ్న సెల్ఫీలు, వీడియోలు పెట్టుకొని రుణాలు ఇచ్చినట్టు వెలుగుచూసింది. దాదాపు 160 మంది యువతులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు.. దాదాపు 10 గిగాబైట్ ఫైళ్లు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి.
బ్యాంకులు, ఇతర సంప్రదాయ రుణ వేదికల నుంచి అప్పులు తీసుకోవడం కష్టంగా మారిన నేపథ్యంలో ప్రజలు ఇలా ఆన్‌లైన్ రుణాల వేదిక సేవల వైపు మొగ్గుచూపుతున్నారని, ఈ నేపథ్యంలో "న్యూడ్ లోన్స్' ఊపందుకున్నాయని, వారానికి 30శాతం వడ్డీతో ఇవి నడుస్తున్నాయని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆన్‌లైన్ వేదికల్లో అప్పులు తీసుకొనేందుకు ముందుకొస్తున్న వారిని.. రుణదాతలు పూచీకత్తు కింద వారి నగ్నఫొటోలు, వీడియోలు ఇవ్వాలని అడుతున్నారు. ఒకవేళ రుణాలు తిరిగి ఇవ్వకుంటే వాటిని మీ స్నేహితులకు, బంధువులకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకున్న వారి నుంచి లైంగిక లబ్ధులను కూడా రుణదాతలు కోరుతున్నట్టు సోషల్ మీడియాలో వెలుగుచూసిన ఫొటోలను బట్టి తెలుస్తున్నది. ఈ బాగోతంపై స్పందించిన జీడాయ్‌బావో ఇలా అక్రమంగా రుణాలు ఇచ్చి వేధిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్టు చైనా అధికారిక ట్విట్టర్ వీబోలో ప్రకటించింది.