ఆ తర్వాత ఏ ఉద్యోగం చేయాలో !
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండుసార్లు సేవలందించిన బరాక్ ఒబామా వచ్చే జనవరి 20 నాటికి ఖాళీగా మారబోతున్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక 55 ఏళ్ల వయస్సులో ఎలాంటి పని చేయాలన్న దానిపై ఇప్పటికీ తనకు క్లారిటీ లేదని ఒబామా చెప్పారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి తాను కూడా అందరిలాగా 'లింకెడ్ ఇన్' వెబ్ సైట్ లో చేరాల్సి వస్తుందేమోనంటూ ఆయన జోకులు వేశారు.
'సెలెక్ట్ యూఎస్ ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్' సదస్సులో సోమవారం ప్రసంగించిన ఒబామా వ్యాపారం చేయడానికి అమెరికా గొప్ప ప్రదేశమని ప్రశంసించారు. ఈ సందర్భంగా తన భవిష్యత్ గురించి ప్రస్తావించిన ఒబామా ' మరో ఏడు నెలల్లో నేను ఉద్యోగ విపణిలోకి అడుగుపెడతాను. అక్కడికి వెళ్లడం నాకు ఆనందంగానే ఉంది. నేను కూడా లింకెడ్ ఇన్ లో ఖాతా తెరుస్తాను. ఎలాంటి (ఉద్యోగాలు) వస్తాయో చూడాలి' అంటూ చమత్కరించారు. ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ అయినా లింకెడ్ ను మైక్రోసాఫ్ట్ ఇటీవల 26.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగం కోసం లింకెడిన్ లో చేరే విషయమై ఇంతకుమునుపు కూడా ఒబామా ఓసారి పేర్కొన్న సంగతి తెలిసిందే.
హోనులులులో బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ దుకాణంలో టీనేజర్ గా తాను చేసిన తొలి ఉద్యోగం నాటి జ్ఞాపకాలను ఒబామా గుర్తుచేసుకున్నారు. వేసవిలో తాను చేసిన ఆ తొలి ఉద్యోగం అంత గొప్పదేమీ కాకపోయినా.. అది తనకు విలువైన పాఠాలను నేర్పిందని, బాధ్యత, కటోరశ్రమతోపాటు స్నేహితులు, కుటుంబం, చదువును సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను ఆ ఉద్యోగం నేర్పిందని ఒబామా నెమరువేసుకున్నారు. ,