కిడ్నాప్‌కు గురైన శ్రీకాంత్ గౌడ్(ఫైల్ ఫొటో)
- ఢిల్లీలో గద్వాల వైద్య విద్యార్థి అపహరణ
- కిడ్నాప్‌కు పాల్పడింది క్యాబ్ డ్రైవరే..
- రూ.5 కోట్లు ఇవ్వాలని ఓలా సంస్థకు డిమాండ్
- గురువారం అర్ధరాత్రి ఘటన.. శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు
- శనివారం సాయంత్రం ఫోన్ లిఫ్ట్ చేసిన కిడ్నాపర్!
- ప్రత్యేక బృందంతో గాలిస్తున్న ఢిల్లీ పోలీసులు
- తెలియరాని క్యాబ్ డ్రైవర్ వివరాలు.. అతడు ఓలా సంస్థకు ఇచ్చిన డాక్యుమెంట్లూ నకిలీవే!
సాక్షి, న్యూఢిల్లీ/గద్వాల
వైద్యవిద్య కోసం ఢిల్లీ వెళ్లిన శ్రీకాంత్ గౌడ్ అనే తెలుగు విద్యార్థి కిడ్నాపయ్యాడు. ఆయన తన గదికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకోగా.. ఆ క్యాబ్ డ్రైవరే కిడ్నాప్ చేశాడు. శ్రీకాంత్‌ను వదిలిపెట్టాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ తను పనిచేస్తున్న ఓలా సంస్థను డిమాండ్ చేశాడు. దీనిని తొలుత సీరియస్‌గా తీసుకోని ఓలా యాజమాన్యం.. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రీత్‌విహార్ ప్రాంతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు శ్రీకాంత్ స్నేహితులు కూడా గురువారం రాత్రి నుంచి శ్రీకాంత్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.
దీంతో కిడ్నాప్ ఉదంతం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ స్నేహితులను, బంధువులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ ఎవరు? అతని పేరు, ఇతర వివరాలు, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది వంటి వివరాలేవీ బహిర్గతం కాలేదు. అటు పోలీసులుగానీ, ఇటు ఓలా సంస్థగానీ ఏమీ వెల్లడించకపోవడంపై సందేహాలు రేకెత్తుతున్నాయి.
నేడు తేలుస్తానన్న కిడ్నాపర్..
శ్రీకాంత్ ఫోన్ నంబర్‌కు ఆయన బంధువులు, స్నేహితులు పదే పదే కాల్ చేసి చూస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నాపర్ శనివారం సాయంత్రం ఫోన్ లిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఈ విషయమై తేలుస్తానంటూ.. హిందీలో ఏదో చెప్పారని శ్రీకాంత్ బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై పోలీసులను ప్రశ్నించగా.. తాము ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేస్తున్నామని చెప్పారు.
అసలు ఏం జరిగింది?
గద్వాల పట్టణానికి చెందిన అక్కాల శ్రీకాంత్‌గౌడ్ (29) చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలో వైద్య విద్య పీజీ చేస్తూ.. అక్కడి ప్రీత్‌విహార్ ప్రాంతంలో ఉన్న మెట్రో ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రీన్‌పార్కు ప్రాంతంలోని గౌతమ్‌నగర్‌లో ఓ గదిలో స్నేహితులతో కలసి నివాసముంటున్నారు. గురువారం రాత్రి మెట్రో ఆస్పత్రిలో డ్యూటీ పూర్తయిన అనంతరం శ్రీకాంత్, మరికొందరు స్నేహితులు కలసి హోటల్ రాడిసన్ బ్లూలో భోజనం చేశారు. అనంతరం రాత్రి 11.30 సమయంలో శ్రీకాంత్‌ను మెట్రో స్టేషన్‌లో డ్రాప్ చేసి వెళ్లిపోయారు. అప్పటికే చివరి మెట్రో సర్వీసు వెళ్లిపోవడంతో శ్రీకాంత్ ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే క్యాబ్ డ్రైవర్ మార్గమధ్యలోనే.. శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేశాడు. ఆయన ఫోన్‌ను లాక్కుని స్విచాఫ్ చేసేశాడు. అనంతరం తాను పనిచేస్తున్న ఓలా యాజమాన్యానికి ఫోన్ చేసి.. శ్రీకాంత్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశానని, ఆయనను విడుదల చేయాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఓలా యాజమాన్యం శుక్రవారం ప్రీత్‌విహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్.. శ్రీకాంత్ బంధువులకు గానీ, స్నేహితులకు గానీ, ఆసుపత్రికి గానీ ఫోన్ చేయకపోవడం గమనార్హం.
అటు స్నేహితులు కూడా..
హోటల్‌లో స్నేహితులతో కలసి భోజనం చేసిన శ్రీకాంత్.. గురువారం రాత్రి రూమ్‌కు చేరలేదు. శుక్రవారం ఉదయం 9.00 గంటలకు ఆస్పత్రిలో రిపోర్టు చేయాల్సి ఉన్నా వెళ్లలేదు. దీంతో సహచర వైద్య విద్యార్థులు.. శ్రీకాంత్‌తో కలసి రూమ్‌లో ఉండే హేమంత్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే శ్రీకాంత్ గురువారం రాత్రి కాసేపట్లో రూమ్‌కు వస్తానని ఫోన్ చేశాడని, కానీ రూమ్‌కు రాలేదని హేమంత్ చెప్పారు. ఇక శ్రీకాంత్ ఫోన్ నంబర్‌కు తాము పంపిన ఎస్సెమ్మెస్ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో డెలివరీ అయినట్టు అలర్ట్ ఎస్సెమ్మెస్ వచ్చిందని శ్రీకాంత్ సహచర వైద్యుడు సుబ్బారావు వెల్లడించారు. దాంతో ఫోన్ స్విచాన్ చేసి ఉంటారనే ఉద్దేశంతో కాల్ చేశామని.. తనకు ఆ ఫోన్ దొరికిందని, తాను ఎవరి వద్దా ఫోన్ తీసుకోలేదని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన వ్యక్తి చెప్పాడని వెల్లడించారు. దీంతో శ్రీకాంత్ ఆచూకీ కోసం ఫిర్యాదు చేసేందుకు స్నేహితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే అప్పటికే శ్రీకాంత్‌ను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లుగా ఓలా సంస్థ ఫిర్యాదు చేసిన విషయం వారికి తెలిసింది.
ప్రత్యేక బృందంతో దర్యాప్తు
శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే క్యాబ్‌లో ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనం ఎటు వెళ్లింది, ఎక్కడ ఉందన్న విషయాన్ని గుర్తించడానికి ఓలా యాజమాన్యం, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ ఫోన్ సిగ్నల్ టవర్ లొకేషన్ ప్రాంతాలనూ పరిశీలిస్తున్నారు. ఓలాలో పనిచేసేందుకు క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన డాక్యుమెంట్లు కూడా నకిలీవిగా గుర్తించినట్టు సమాచారం. కాగా శ్రీకాంత్ ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని.. క్యాబ్ డ్రైవర్ స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని ప్రీత్‌విహార్ పోలీసువర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.
వైద్యుడిగా పనిచేస్తూ..
గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన జనార్ధన్‌గౌడ్, భారతమ్మ దంపతుల ఏకైక కుమారుడు అక్కాల శ్రీకాంత్‌గౌడ్ (29). ఇంటర్ వరకు గద్వాలలోనే చదువుకున్న శ్రీకాంత్.. 2011లో చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. తర్వాత నిబంధనల మేరకు మన దేశంలో వైద్యవృత్తి చేసేందుకు ఆలిండియా మెడికల్ కౌన్సిల్ పరీక్ష రాశారు. ఈ పరీక్ష కోసం మూడేళ్లపాటు ఢిల్లీలో ఉండి శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలోని మెట్రో ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తూనే.. వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేస్తున్నారు.
ఆందోళనలో తల్లిదండ్రులు
తమ కుమారుడు కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రులు జనార్ధన్‌గౌడ్, భారతమ్మ ఆందోళనలో మునిగిపోయారు. దయచేసి తమ కుమారుడిని రక్షించాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని తమ కుమారుడిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే శ్రీకాంత్‌గౌడ్ బాబాయి నారాయణగౌడ్, బంధువులు ఢిల్లీకి చేరుకున్నారు.
(కొడుకు కోసం ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, ఇన్సెట్లో కిడ్నాప్‌కు గురైన శ్రీకాంత్)