ఏడున్నవ్ బిడ్డా..!
- ఇంకా లభించని శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ
- దుఃఖసాగరంలో తల్లిదండ్రులు
గద్వాల/గద్వాల క్రైం: ‘తిన్నరా అని అడిగితివి.. ఇంటికి వస్తనంటివి..అందరి యోగ క్షేమాలు తెలుసుకుంటివి.. నీ క్షేమమే తెలియకపాయే బిడ్డా శ్రీకాంత్..!’అంటూ మూడురోజుల క్రితం ఢిల్లీలో కిడ్నాప్‌నకు గురైన జోగుళాంబ గద్వాల జిల్లా కేం ద్రానికి చెందిన వైద్యవిద్యార్థి డాక్టర్ శ్రీకాంత్‌గౌడ్ తల్లిదండ్రులు జనార్దన్‌గౌడ్, భారతమ్మ ఆదివారం కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు అపహ రణకు గురవడంతో తల్లిదండ్రుల నోట మాటరావడం లేదు. గురువారం ఓలా క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారని.. క్షోభ పెట్టొద్దని అతడి చెల్లెళ్లు ప్రాథేయపడు తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి తమ అన్నను క్షేమంగా తీసుకురావా లని కోరుతున్నారు. కాగా కిడ్నాప్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డీకే అరుణ.. శ్రీకాంత్ తల్లితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వపెద్దలతో మాట్లాడి కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కొనసాగుతున్న గాలింపు చర్యలు..
కాగా, శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఓలా సంస్థ, శ్రీకాంత్ స్నేహితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మీడియాను పోలీస్ స్టేషన్ లోపలికి కూడా అనుమతిం చడం లేదు. మీడియాకు వివరాలు తెలిస్తే నిందితుడు అప్రమత్తమయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఓలా సంస్థ నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన అనంతరం క్యాబ్ డ్రైవర్ ఏ ఏ ప్రాంతాల్లో తిరిగాడు అనే దానిపై క్యాబ్‌లో ఉన్న జీపీఎస్ ఆధారంగా పోలీసులు పరిశీలిస్తున్నారు.
క్యాబ్ డ్రైవర్ స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్ చేసిన అనంతరం నిందితుడు క్యాబ్‌ను ఒక చోట వదిలేసి ఇంకో వాహనాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ మొబైల్‌కు స్నేహితులు పదేపదే ఫోన్ చేస్తుండటంతో శనివారం ఫోన్ లిఫ్ట్ చేసిన నిందితుడు.. ఈ విషయమై ఆదివారం తేల్చేస్తానని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు నిందితుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.