
ఆ సేవలకు ఓలా మంగళం
ముంబై : ప్రముఖ టాక్సీ సర్వీసు సంస్థ ఓలా క్యాబ్స్, 2015లో దక్కించుకున్న టాక్సీ ఫర్ స్యూర్ కంపెనీని మూసివేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూసివేతతో దాదాపు 1000 ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నట్టు వెల్లడవుతోంది. కాల్ సెంటర్లో పనిచేసే వర్కర్లు, డ్రైవర్ సంబంధాల్లో, బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లలో పనిచేసే టాక్సీ ఫర్ స్యూర్ వర్కర్లను కంపెనీ తొలగించనుందని వీసీసీ సర్కిల్ రిపోర్టు చేసింది. అయితే ఓలా వెంటనే దీనిపై స్పందించలేదు.
18 నెలల క్రితమే ఓలా క్యాబ్స్, తన ప్రత్యర్థి సంస్థ టాక్సీ ఫర్ స్యూర్ ను 200 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. క్యాష్, ఈక్విటీ రూపంలో ఈ డీల్ జరిగింది. ఉబర్కు వ్యతిరేకంగా మార్కెట్ లీడర్షిప్ను దక్కించుకోవడానికి ఈ డీల్ను ఓలా కుదుర్చుకుంది. టాక్సీ ఫర్ స్యూర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఓలా, ఆ కంపెనీ కార్యకలాపాలను మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తోంది. ఆ కంపెనీకున్న స్వతంత్ర హక్కులు హరిస్తూ వస్తున్నాయి.
కాగా ప్రస్తుతం ఆ సంస్థను పూర్తిగా మూసివేసే ప్రక్రియలో ఓలా ఉన్నట్టు కంపెనీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల తొలగింపుతో నెలకు రూ.30 కోట్ల వ్యయాన్ని ఓలా తగ్గించుకోనుందని కంపెనీకి చెందిన ఒక ఇన్వెస్టర్ చెప్పారు.