18న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆందోళన | On 18 State wide on ysrcp Concern | Sakshi
Sakshi News home page

18న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆందోళన

Published Thu, Sep 17 2015 3:50 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

18న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆందోళన - Sakshi

18న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆందోళన

రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కార్యక్రమానికి పొంగులేటి: శివకుమార్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపేందుకు ఈ నెల 18 తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులు తీవ్ర సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని  ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వం వైపు నుంచి రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కనిపించడం లేదని చెప్పారు.

బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని తట్టి లేపాలని వైఎస్సార్ సీపీ సంకల్పించిందన్నారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ నెల 18న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు.  ఆరు డిమాండ్లతో కూడిన  వినతి పత్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు రైతులతో కలిసి అందజేస్తారని చెప్పారు.

కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉదయం పది గంటలకు వెయ్యి మంది రైతులతో జరగనున్న కార్యక్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు తప్పకుండా  పాల్గొనాలని శివకుమార్ కోరారు.
 
డిమాండ్లు ఇవే: 1. తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలి. 2. కరువు సహాయక చర్యలు చేపట్టాలి. రైతు రూణమాఫీ ఏకమొత్తంగా చేయాలి. 3. ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. 4. కరువులో రైతులకు కరువు పింఛన్లు రూ.5000 వంతున ఇవ్వాలి. 5. పశువులకు పశుగ్రాసాన్ని, పాడి పశువులకు దానాను ఉచితంగా అందించాలి. 6. జిల్లాలో గల పెండింగ్ ప్రాజెక్ట్‌లు వెంటనే పూర్తి చేసి కరువు నివారణ చర్యలు చేపట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement