
పుట్టిన రోజున మళ్లీ పుట్టాడు
చరణ్‌కు మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి పునర్జన్మ
చిన్నారి ఛాతి నుంచి పెన్సిల్ తొలగింపు
హైదరాబాద్: ప్రమాదవశాత్తు పెన్సిల్ ఛాతిలో దిగడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లిన చిన్నారి చరణ్ (6) ఎట్టకేలకు బతికి బయటపడ్డాడు. హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి వైద్యులు సకాలంలో అతడికి శస్త్ర చికిత్స చేసి పెన్సిల్‌ను బయటకి తీశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన చరణ్ శుక్రవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ కింద పడటంతో ఛాతి ఎడమ భాగంలోని గుండెకు పెన్సిల్ గుచ్చుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు చికిత్స కోసం బాలున్ని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ సిటీసర్జన్ లేక పోవడంతో వెంటనే హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు.
సిటీసర్జన్ డాక్టర్ సమీర్ దివాలే నేతృత్వంలోని వైద్య బృందం శనివారం ఉదయం చరణ్‌కు శస్త్రచికిత్స చేసింది. ఛాతిలో దిగిన రెండు ఇంచుల పెన్సిల్‌ను విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, శనివారంనాడే ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన చరణ్‌కు అదే రోజు వైద్యులు చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు.