ఒక రూపాయి డిపాజిట్ చేస్తే...
న్యూఢిల్లీ: పొదుపుఖాతాలపై ఇండస్ట్రీలోనే ఉత్తమ వడ్డీరేట్లు అందిస్తున్నామంటున్న ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ తన ఖాతాదారులను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ బ్యాంక్లో నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారుడికి అదనపు ప్రయోజనాలు అందిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది.
ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో జమచేసే ఒక్కో రూపాయికి ఒక నిమిషం టాక్ టైమ్ ను అందిస్తోంది. వినియోగదారులకు ఎక్కువ వడ్డీ రేట్లు అందించడంతోపాటు పాటు ఈ అదనపు ప్రయోజనం ద్వారా ఎక్కువ ఖాతాదారులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ ఆఫర్ ఇస్తున్నట్టు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ , ఎండీ, సీఈఓ శశి అరోరా తెలిపారు.
ఉదా : ఒక కస్టమర్ రూ .1000 లను పొదుపు ఖాతాలో జమచేస్తే అతను / ఆమెకి 1000 నిమిషాల ఉచిత టాక్ టైం లభిస్తుంది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కి దేశీయ కాల్స్ కోసం ఈ టాక్ టైంను వాడుకోవచ్చు. అలాగే మొదటిసారి డిపాజిట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా బ్యాంక్ స్పష్టం చేసింది. కాగా పైలట్ ప్రాతిపదికన రాజస్థాన్ లో నవంబర్ 23 న ప్రారంభమైన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ 7.25శాతం వడ్డీ అందిస్తోంది.దీంతోపాటు లక్ష రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా క్పలిస్తోంది. నాన్ ఎయిర్ టెల్ కస్టమర్లు కూడా తన ప్రత్యేక ఎయిర్ టెల్ రీటైల్ కౌంటర్ల ద్వారా ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను తెరవచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే.