కొత్త ఉల్లి వచ్చినా.. తగ్గని ఘాటు
దేవరకద్ర(మహబూబ్‌నగర్): దేవరకద్ర మార్కెట్‌లో ఉల్లిపాయల ధర మరింత పెరిగింది. ధరలు ప్రభావంతో బుధవారం మార్కెట్‌కు వేయి బస్తాల వరకు ఉల్లి పాయలు అమ్మకానికి వచ్చాయి. దీంతో మార్కెట్ అవరణ అంతా ఉల్లిపాయల కుప్పలతో నిండిపోయింది. వేలం జోరుగా సాగింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 3600 ధర పలికింది. కనిష్టంగా రూ. 3 వేల వరకు వచ్చింది. ఇక చిన్నసైజు పేడు ఉల్లి పాయలకు రూ. 2 వేల నుంచి రూ.2500 వరకు దక్కింది.
కొత్త ఉల్లికి ధర బాగా రావటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో టోకుగా ఖరీదు చేసిన చిల్లర వ్యాపారులు బయట సంతలో కిలో ఉల్లిని రూ.40 వరకు విక్రయించారు. మార్కెట్‌లో వ్యాపారులు వేలం ద్వార కొనుగోలు చేసిన ఉల్లిని బస్తాలుగా విక్రయించారు. 45 కేజీల ఉల్లి బస్తా ధర గరిష్టంగా రూ.2 వేల నుంచి కనిష్టంగా రూ.1800 వరకు చిల్లర వ్యాపారులు కొనుగోలు చేశారు.