
నిమిషానికి 7200 రైల్వే టికెట్లు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ టిక్కెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునీకరించనున్నామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ రిజర్వేషన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. దీనివల్ల నిమిషానికి 7200 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లక్షమంది లాగిన్ అయినా సమస్యరాని విధంగా దీన్ని అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఇక నుంచి రైలు, కోచ్, బెర్త్.. ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పారు. రిటర్న్ జర్నీతో బుక్ చేసుకునేవారికి ఆటోమేటిగ్గా చార్జీ తగ్గేలా ఏర్పాటుచేస్తామన్నారు.
అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వై-పై సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని స్టేషన్లలో రిటైరింగ్ రూంలను ఆన్ లైన్ లో బుక్ చేసుకునేలా విస్తరిస్తామన్నారు. ప్రధాన స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీటికి ఆర్డర్ చేయచ్చని తెలిపారు. పార్కింగ్ కమ్ ప్లాట్ఫారం టికెట్లను ప్రవేశపెడతామని, దీనివల్ల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.