
ప్రజాసంక్షేమమే మా ఎజెండా
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
వనపర్తిటౌన్: ‘ప్రజలు బాగుపడితే మేమే బాగు పడుతున్నట్లుగా ఆనందించి బతుకుతున్న వ్యక్తులం.. మాకు ప్రజల బాగోగులు తప్ప ఎలాంటి ఆశలు, ఆకాంక్షలు లేవు’ అని తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఒకరిపై మరొకరు తిట్టిపోసుకునే రాజకీయాల జోలికి వెళ్లబోమని, రాజకీయాలు తనకు అవసరం లేదని స్పష్టంచేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలోని పాలిటెక్నిక్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) నిర్వహించిన ‘ప్రభుత్వ విద్య సంక్షోభం.. పరిష్కార మార్గాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక శ్వాస, ధ్యాసంతా అనునిత్యం ప్రజల వైపే ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వ విద్యను నిర్వర్యీం చేసేందుకు, తన బంధువులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ రంగాన్ని తీసుకొచ్చారని కోదండరాం మండిపడ్డారు. బాబు నిర్వాహకం వల్లే ప్రైవేట్ పెత్తనం పెరిగి, ప్రభుత్వ విద్య పతనావస్థకు చేరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు చొరవచూపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించి నైపుణ్యాలు పెంపొందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమించకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించారు. ఉపాధిహామీ, మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమిటో అర్థంకావడం లేదని విస్మయం వ్యక్తంచేశారు.
ఉపాధిహామీ కూలీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేసి వాటి అమలుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు, ఉపాధ్యక్షుడు ఆర్.విజయ్‌కుమార్, పబ్లికేషన్ కార్యదర్శి సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజు, రవీందర్‌గౌడ్, జిల్లా మహిళా ప్రతినిధులు పుష్పలత, శారద పాల్గొన్నారు.