నడిరోడ్డు మీద వాహనాలు అటూ-ఇటూ రద్దీగా వెళుతున్న సమయంలో ఓ అమ్మాయికి యువకుడు తన ప్రేమను తెలుపుతూ ప్రపోజ్ చేయడం మహారాష్ట్రలోని భివండిలో దుమారం రేపుతోంది. స్థానిక మతనాయకులు ఈ జంట చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. భివండిలో ఈ నెల 11న యువకుడు బురఖా ధరించిన ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఆమెను కౌగిలించుకొని తన ప్రేమను ప్రకటించాడు. ఈ అనూహ్య ఘటనను చూసి కొందరు వాహనదారులు విస్తుపోగా.. మరికొందరు వారిని ఉత్సాహ పరిచారు. వీరి ప్రపోజ్ వీడియో సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో పెనుదుమారం సృష్టించింది.
వైరల్‌గా మారిన ఈ వీడియోపై మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కూడా ముస్లిం వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో వారి తీరు మత ఆచారాలకు విరుద్ధంగా ఉందని, వారికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తామంటూ మతసంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి తీవ్ర బెదిరింపులు వస్తున్నాయని అమ్మాయి తండ్రి తెలిపారు. ఇలా వేధింపులు ఆపకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని అమ్మాయి కూడా మీడియాతో పేర్కొంది. మరోవైపు నడిరోడ్డు మీద తాను చేసిన చర్యకు విచారం వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు చెప్తూ సదరు అబ్బాయి కూడా యూట్యూబ్‌లో రెండు వీడియోలు పెట్టారు. మతపెద్దల బెదిరింపుల నేపథ్యంలో ఆ జంటకు పోలీసులు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి బెదిరింపులు గురిచేసే వారిపై తీవ్రంగా చర్యలు ఉంటాయని, అలాగే వారి ప్రేమ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టుచేసిన వ్యక్తిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.