యోగి ఆదిత్యనాథ్‌పై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నుకోవడం ప్రధాని నరేంద్రమోదీ 'నూతన భారత' విజన్‌లో భాగమని, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒకింత ఘాటుగా స్పందించారు. ముస్లిం ఫైర్‌బ్రాండ్ నేతగా పేరొందిన ఒవైసీ మోదీ నిర్ణయాన్ని పరోక్షంగా ఎద్దేవా చేశారు. భారత అనాది హిందు, ముస్లిం సంస్కృతుల సమ్మేళనమైన 'గంగాయమున తెహజీబ్'పై ఇది దాడి చేయడమేనని తీవ్రంగా మండిపడ్డారు.
'ఇదే మోదీజీ, బీజేపీ కొత్త భారతం. ఇందులో ఆశ్చర్యపోవాల్సినది ఏముంది? అధికారంలో ఉన్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ ముస్లింలను వంచించింది. ఇప్పడు పరిమితవాద అభివృద్ధి నమూనాను మనం చూడబోతున్నాం. వాళ్లు మాట్లాడుతున్న 'ప్రగతి' ఇదే' అని ఒవైసీ పేర్కొన్నారు. కాగా, మరో ముస్లిం నాయకుడు అయిన ఢిల్లీ జమా మసీదు ఇమాం సయెద్ అహ్మద్ బుఖారీ ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. తన వివాదాస్పద గతాన్ని వీడనాడి.. ప్రధాని మోదీ పేర్కొన్నట్టు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం యోగి ఆదిత్యనాథ్ కృషి చేస్తారని తాను భావిస్తున్నట్టు బుఖారీ చెప్పారు.