రూపు మార్చే మాయా ఫోన్
వాషింగ్టన్: బయటికి వెళుతున్నారు.. జేబులన్నీ ఫుల్.. మీ ఫోన్ బయటే ఉండిపోయింది.. ఎలా? దాన్ని కాస్త అటూ ఇటూ తిప్పగానే బ్రాస్‌లెట్‌లా మారిపోయింది. చేతికి పెట్టుకుని బయలుదేరారు.. ఫోన్‌లో ఓ వీడియో చూడా లి.. మళ్లీ అటూ ఇటూ తిప్పారు.. ఫోన్‌లా మారిపోయింది.. అవసరమైనప్పుడు ఒక పుస్తకం ఆకారంలోకి వచ్చేసింది ఇలాంటి ఫోన్ ఉంటే భలేగా ఉంటుంది కదూ.. బెల్జియం దేశానికి చెందిన హాస్లెట్ యూనివర్సిటీ ఐమైండ్స్ పరిశోధకులు ‘పాడిల్’ పేరిట ఇలాంటి ఫోన్ ప్రాథమిక నమూనా(ప్రొటోటైప్)ను రూపొందించారు.
రూబిక్స్ మ్యాజిక్ పజిల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ‘పాడిల్’ను రూపొందించినట్లు దీని తయారీలో పాల్గొన్న శాస్త్రవేత్త రాఫ్ రామేకర్స్ పేర్కొన్నారు. ఈ ఫోన్ ప్రస్తుతం 15 ఆకారాల్లోకి మారగలదని చెప్పా రు. దీని ప్రస్తుత డిజైన్ ప్రకారం.. ఒక ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, ఒక ప్రొజెక్టర్ అవసరమని తెలిపారు. ఈ రెండు పరికరాల సహాయంతో.. ‘పాడిల్’ను వివిధ ఆకారాల్లోకి మార్చడంతో పాటు, ఆపరేట్ చేయవచ్చని తెలిపారు. ఆ పరికరాల అవసరం లేకుండా.. పూర్తిస్థాయిలో ‘పాడిల్’ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. అది మరో ఏడాదిన్నరలో అందుబాటులోకి రావచ్చని రామేకర్స్ చెప్పారు.