
భారత్‌ను దెప్పిపొడిచిన పాక్ ఆర్మీ!
న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ గెలువడంతో దాయాది ఆర్మీ భారత్‌ను దెప్పిపొడిచింది. భారత్‌పై పాక్ గెలువడంతో కల్లోలిత బెలూచిస్థాన్‌లో సంబరాలు జరిగాయి. ఈ సంబరాల ఫొటోలను పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. అంతేకాదు, పాక్ విజయంపై శ్రీనగర్‌లో సంబరాలు చేసుకున్న వీడియోను సైతం అసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో పెట్టారు.
కల్లోలిత బెలూచిస్థాన్‌లో పాక్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ను ఎద్దేవా చేసేలా.. ‘ఇది మా బెలూచిస్థాన్.. ఎవరికైనా ఆందోళనలు ఉంటే మానుకోండి’ అంటూ బెలూచిస్థాన్‌లో సంబరాల ఫొటోలను గఫూర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఇదీ శ్రీనగర్ అంటూ అక్కడి సంబరాల వీడియోను షేర్ చేశారు. ‘పాక్ వీరోచిత సైనికులు పాకిస్థాన్ జట్టుకు, జాతికి అభినందనలు తెలిపారు. మనమంతా ఐక్యంగా శత్రువుల కుట్ర నుంచి, ముప్పు నుంచి పాకిస్థాన్‌ను కాపాడుకుందాం’ అంటూ అతను మరో ట్వీట్ చేశాడు.