
సర్జికల్ దాడులపై పాక్ హ్యాకర్ల ప్రతీకారం!
భారత సైన్యం సర్జికల్ దాడులకు ప్రతీకారంగా తాము భారత్‌కు చెందిన 7,070 వెబ్‌సైట్లు హ్యాక్ చేసినట్టు పాకిస్థాన్ హ్యాకర్ల గ్రూప్ ఒకటి పేర్కొంది.
బెంగళూరు: భారత సైన్యం సర్జికల్ దాడుల నేపథ్యంలో ప్రతీకారంగా తాము భారత్‌కు చెందిన 7,070 వెబ్‌సైట్లు హ్యాక్ చేసినట్టు పాకిస్థాన్ హ్యాకర్ల గ్రూప్ ఒకటి పేర్కొంది. తాము హ్యాక్ చేసిన భారత్ వెబ్‌సైట్ల జాబితాను అది గురువారం విడుదల చేసింది. అయితే, ఈ హ్యాకర్లు పెద్ద నిపుణులేం కాదని, సొంతంగా కోడ్ రాసుకొని హ్యాక్ చేయడం కాకుండా అప్పటికే ఉన్న స్క్రిప్ట్స్ తో వీరు హ్యాకింగ్ కు పాల్పడ్డారని, వీరే కేవలం 'స్క్రిప్ట్ కిడ్డీస్' మాత్రమేనని భారత సాఫ్ట్‌వేర్ నిపుణులు చెప్తున్నారు.
పాకిస్థాన్ హక్సర్ క్రూ అనే హ్యాకర్ల గ్రూప్ భారత వెబ్‌సైట్లను హ్యాక్ చేసి.. ప్రతి సైట్‌లోనూ 'యే వతన్ తేరా ఇషారా ఆగాయా, అర్ సిపాహికో పుకార్ ఆగయా' (దేశమా నీ సంకేతం అందింది. ప్రతి సైనికుడికి పిలుపు అందింది' అన్న పాట ప్లే అయ్యేలా ఏర్పాటుచేసింది. ఈ గ్రూప్ గతంలో టాటా మోటార్స్, అన్నాడీఎంకే, తాజమహల్ వంటి వెబ్‌సైట్లను హ్యాక్ చేసింది.
తాజాగా హ్యాకింగ్‌కు గురైనవి చాలావరకు ప్రభుత్వేతర చిన్న వెబ్‌సైట్లు మాత్రమేనని, అయితే, భారత వెబ్‌సైట్లు ఎంత బలహీనంగా ఉన్నాయో ఈ హ్యాకింగ్ ఉదంతం స్పష్టం చేస్తున్నదని నిపుణులు అంటున్నారు. పెద్దగా పరిజ్ఞానంలేనివాళ్లే ఇలా హ్యాకింగ్‌కు పాల్పడితే.. ఇక, నిజమైన హ్యాకర్లు హ్యాకింగ్ చేస్తే నష్టం చాలా పెద్దస్థాయిలో ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. 2010 జనవరి నుంచి 2015 డిసెంబర్ మధ్యకాలంలో 1490 ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాక్ అయ్యాయని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
'వారి పోస్టులు నేను చూశాను. వారు నిజానికి హ్యాకర్లే కాదు. వారు కేవలం స్కిప్ట్ కిడ్డీస్ మాత్రమే. ఈ తరహా వ్యక్తులు అప్పటికే ఉన్న కంప్యూటర్ స్క్రిప్ట్‌లను ఉపయోగించి ఇతర కంప్యూటర్లను హ్యాక్ చేస్తుంటారు. సొంతంగా కోడ్ రాసుకునే పరిజ్ఞానం వారికి ఉండదు' అని గ్లోబల్ సెక్యూరిటీ రెస్పాన్స్ టీమ్ లీగల్ హెడ్ మిర్జా ఫైజాన్ తెలిపారు.