9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్!
మంచెస్టర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించింది. ఓల్డ్ ట్రాఫర్డ్ లో బుధవారం రాత్రి జరిగిన ఏకైక టీ-20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది.
నూతన కెప్టెన్ సర్ఫ్ రాజ్ అహ్మద్ నాయకత్వంలో బరిలోకి దిగిన పాక్ జట్టు ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో వాహెబ్ రియాజ్ అద్భుతంగా రాణించి 18 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ ఇమద్ వసీం 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లో అలెక్స్ హేల్స్ (37 పరుగులు), జాసన్ రాయ్ (21 పరుగులు) తప్ప పెద్దగా ఎవరూ రాణించలేదు.
136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఆడుతూ పాడుతూ గమ్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ (59 పరుగులు), ఖలీద్ లతీఫ్ (59 పరుగులు నాటౌట్) అద్భుతంగా ఆడి గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో 31 బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ కోల్పోయి.. పాక్ జట్టు 136 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఇలా పాకిస్తాన్ టీ 20 చరిత్రలో 9 వికెట్ల తేడాతో గెలవడం ఇదే తొలిసారి.
పెద్దగా అంచనాలు లేకుండా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ జట్టు టెస్టు సిరీస్ ను 2-2తో డ్రా చేసుకోగా.. వన్డే సిరీస్ ను మాత్రం 4-1 తేడాతో ఓడిపోయింది.