పాక్ జైల్లో ఖైదీగా ఉన్న తాలిబాన్ అగ్రనాయకుడు ముల్లా అబ్దుల్ ఘానీ బర్దర్ను విడుదల చేస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి శనివారం ఇస్లామాబాద్లో వెల్లడించారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అదికాక ఇటీవల ఆఫ్ఘాన్ అధ్యక్షుడు హామీద్ కర్జాయ్ పాక్లో పర్యటించారు.
ఆ సందర్భంగా ఘానీ బర్దర్ను విడుదల చేయాలని కర్జాయ్ చేసిన డిమాండ్ను ఈ సందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి గుర్తు చేశారు. ప్రముఖ తీవ్రవాద సంస్థ తాలిబన్ స్థాపనలో ఘానీ బర్దర్ అత్యంత కీలకపాత్ర పోషించారని చెప్పారు. తాలిబన్ అగ్రశ్రేణీ నాయకుడిగా వ్యవహారిస్తున్న ఆయన్ని 2010 ఫిబ్రవరిలో కరాచీలో పోలీసులు ఆరెస్ట్ చేసినట్లు వివరించారు. గడిచిన 10 నెలల కాలంలో దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న దాదాపు 33 మంది తాలిబన్ నాయకులను విడుదల చేసినట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి తెలిపారు.