జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ సేనలు కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ పది సార్లు పాక్ బలగాలు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఆదివారం సైతం పూంచ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ సైనికులు భారీగా కాల్పులకు తెగబడ్డారు. వీటిని భారత సేనలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అయితే నివాస ప్రాంతాలపై సైతం పాక్ జవాన్లు దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. పాక్ బలగాల వరుస దాడుల నేపథ్యంలో జమ్మూ సెక్టార్‌లోని ఆర్‌ఎస్ పురా, ఆర్నియా ప్రాంతాల్లో 200 మందిని పోలీసులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు జమ్మూ జిల్లా కలెక్టర్ అజీత్ కుమార్ సాహూ నిర్థారించారు.
సరిహద్దుల వద్ద పరిస్థితులు ఊహించని రీతిలో ఉన్నాయని పేర్కొన్నారు. శనివారం కూడా పాక్ బలగాలు ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో మోర్టార్ షెల్స్‌తో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. శుక్రవారం పాక్ సైనికుల కాల్పుల్లో ఓ బాలిక మృతి చెందగా.. ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. గత కొద్ది నెలల్లో పాక్ బలగాలు వంద సార్లకుపైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత ప్రభుత్వం మండిపడింది. పాక్ బలగాల కవ్వింపు చర్యలను ఖండిస్తున్నామని, పాక్ సేనలకు దీటుగా సమాధానం చెప్పాలని రక్షణ శాఖ వర్గాలను ఆదేశించామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.