శాంసంగ్కు అక్కడ కూడా ఎదురుదెబ్బ
శాంసంగ్కు అక్కడ కూడా ఎదురుదెబ్బ
Published Mon, Sep 12 2016 8:54 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
ఇస్లామాబాద్ : బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఓ వైపు సంస్థను, మరోవైపు యూజర్లను వణికిస్తున్న శాంసంగ్ తాజా స్మార్ట్ఫోన్ గెలాక్సీ నోట్7కు పాకిస్తాన్లోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక దేశాల విమాన సంస్థలు తమ విమానాల్లో ఈ ఫోన్ వాడకాన్ని నిషేధించగా.. తాజాగా పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థలు(పీఐఏ) కూడా గెలాక్సీ నోట్7పై నిషేధాజ్ఞలు విధించాయి. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో విమానాల్లో ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్టు అధికారులు ఆదివారం ఆదేశాలు జారీచేశారు. విమానాల్లో వినియోగదారులు గెలాక్సీ నోట్7 స్మార్ట్ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ప్యాసెంజర్లు అసలు ఈ ఫోన్ను తీసుకురావద్దని, చెక్-ఇన్ లగేజీల్లో కూడా కనిపించవద్దని పీఐఏ యూజర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రయాణికుల సురక్షిణార్థమే ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్టు పీఐఏ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
భారత విమానాల్లో ఈ ఫోన్లు వాడొద్దంటూ అధికార డిజీసీఏ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత ఎయిర్ లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ అలాగే అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్ లైన్ రెగ్యులేటర్ ,ది ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ( ఎఫ్ఎఎ)లు ఈ ఫోన్పై ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఆదివారం పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థల అధికారులు కూడా ఈ ఫోన్ పై ప్రయాణికులకు నిషేధాజ్ఞలు జారీ చేశారు. తాజా నిషేధాజ్ఞలతో శాంసంగ్ కంపెనీ షేర్లు భారీగా కుప్పకూలుతున్నాయి. ఈ ఫోన్ వినియోగం అత్యంత ప్రమాదకరమైనదిగా యూఎస్ రెగ్యులేటరీ పేర్కొంటూ, వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలనే ఆదేశాల జారీ అనంతరం కంపెనీ షేర్లు మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి.
ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేసిన ఈ ఫోన్ బ్యాటరీలు పేలుళ్ల సంఘటనలతో సంస్థకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలించింది. మరోవైపు యూజర్లకు చెమటలు పట్టించింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే సప్లైను మించి డిమాండ్లో దూసుకుపోయిన ఈ ఫోన్లు, తాజా ఘటనలతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. కంపెనీ ఇప్పటికే 2.5 మిలియన్ ఫోన్లను రీకాల్ చేసినట్టు ప్రకటించింది. చార్జ్ చేస్తున్నప్పుడు లేదా కాల్ ఆన్షర్ చేస్తున్నప్పుడు ఈ ఘటనలు సంభవిస్తున్నాయని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సెప్టెంబర్ 19లోపు గెలాక్సీ నోట్7లన్నింటినీ రిప్లేస్ చేస్తామని శాంసంగ్ ప్రకటించింది.
Advertisement