కులాంతర పెళ్లికి 50 వేల పన్ను
కతిహార్: భిన్నంగా వ్యవహరిస్తూ మరోసారి బీహార్ కు చెందిన ఓ పంచాయతీ తీరు వార్తల్లోకి ఎక్కింది. కులాంతర వివాహం చేసుకున్న ఓ యువజంటకు అక్షరాల రూ.50 వేల రూపాయల పన్ను వేసింది. కతిహార్ జిల్లాలోని గోగ్రా గ్రామానికి చెందిన చోటు యాదవ్ తన పక్క గ్రామం అయిన రోహియాకు చెందిన సోని కుమాయ్ అనే మరో కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అనంతరం వారిద్దరు కతిహార్ లోకల్ కోర్టులో వివాహం చేసుకున్నారు. ఇదే కోర్టులోని హోటల్లో చోటు పనిచేస్తాడు.
ఈ పెళ్లికి ముందు పెద్దల నుంచి సమస్యలు వచ్చినా తదనంతరం అంగీకరించారు. అయితే, తాజాగా వారు సొంత గ్రామానికి వచ్చినప్పుడు మాత్రం అసలు సమస్య మొదలైంది. గత నెలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసిన పంచాయతీ పెద్దలు కులాంతర వివాహం చేసుకున్నవారిరువురికి రూ.50 వేలు ట్యాక్స్ వేశారట. అది చెల్లించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా నోటీసులు జారీ చేశారట. దీంతో చోటు యాదవ్ బుధవారం ఈ వివరాలు మీడియాకు తెలిపాడు. తాము చాలా పేదవాళ్లమని, అంత డబ్బు చెల్లించలేమని చెప్పినా వినకుండా బెదిరించి మరి ఫైన్ వేశారని వాపోయాడు.